Amaravati Smart City Project: స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాజధానిలో ఇది వరకూ ప్రతిపాదించిన 4 ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. మరికొన్ని ప్రాజెక్టుల్ని కుదించింది. వాటికి బదులుగా ఇతర ప్రాంతాల వారికి స్థలాలిచ్చిన దగ్గర డిజిటల్ లైబ్రరీలు, అంగన్వాడీ సెంటర్లను ప్రతిపాదించింది. ప్రాజెక్టును రద్దు చేయడం కారణంగా.. మిగిలిన నిధుల్ని అక్కడ ఖర్చు చేయబోతోంది.
ఈ నెల 1న జరిగిన అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇది నిబంధనలకు విరుద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా.. కేంద్రం నుంచి ముందుగానే లిఖితపూర్వకంగా అనుమతి ఉండాలి.
State govt abandoned Amaravati: అమరావతిపై ఎందుకంత అక్కసు.. అవకాశం వచ్చినా మీ ప్రభుత్వానికి కనబడదా..!
అమరావతిలో స్మార్ట్ వార్డ్స్ అభివృద్ధి, పట్టణ క్రీడా కేంద్రాల ప్రాజెక్టులు, ఘనవ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు, మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని తాజాగా రద్దు చేశారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం, ఈ-ఆరోగ్య కేంద్రాలు, నీటి శుద్ధి కేంద్రం ప్రాజెక్టులు, పాఠశాలల్ని కుదించారు. అమరావతి సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ వ్యయాన్ని 86 కోట్ల నుంచి 37.89 కోట్లకు కుదించారు.
కేంద్ర ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకి, ASSCCL కి గతంలో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం.. 58 కోట్ల నిధుల్ని సిటీ ఇన్వెస్ట్‌మెంట్ టు ఇన్నోవేటివ్, ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టెయిన్ కార్యక్రమానికి మళ్లించనున్నారు. ఈ కార్యక్రమం కింద కూడా సెంటు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రాంతాల్లో ఈ-ఆరోగ్య కేంద్రాలు, స్కూల్స్ నిర్మించనున్నారు. సెంటు స్థలాలిచ్చిన ప్రాంతాల్లో 27.06 కోట్ల రూపాయలతో అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు నిర్మిస్తారు.
Attack on Amaravati Farmers: అమరావతి రైతులపై పోలీసుల 'కర్కశత్వం'.. అడ్డొచ్చిన వారిని ఈడ్చుకుంటూ..!
కేంద్ర ప్రభుత్వం 2017లో అమరావతిని ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. అమరావతి స్మార్ట్ సిటీ డీపీఆర్‌కి అనుమతిచ్చి, తన వాటాగా 500 కోట్ల రూపాయల నిధులూ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మరో 500 కోట్ల రూపాయలను సమకూర్చాలి. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు నిధులతో అక్కడ చేపట్టే ఎటువంటి ప్రాజెక్టయినా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉండాలి.
ఇప్పటి వరకూ ప్రతిపాదించిన ప్రాజెక్టులను ఇష్టం వచ్చినట్లు రద్దు చేసి.. కొత్తవి జత చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి వీల్లేదు. ముందుగా మార్పులు చేసేసి.. బోర్డు ముందు నిర్ణయం తీసేసుకుని.. తర్వాత తీరిగ్గా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని చెప్పడానికీ కుదరదు. ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసిన స్మార్ట్ వార్డుల అభివృద్ధి, మురుగునీటి శుద్ధి, ఘనవ్యర్థాల ప్రాజెక్టులు వంటివి కూడా అమరావతికి అత్యంత కీలకమైనవే.
distribution of plots in Amaravati : రాజధాని రైతులను అణచి.. అమరావతిలో నేడు ఇళ్ల పట్టాల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాలపై ప్రస్తుతానికి లబ్ధిదారులకు హక్కు లేదు. కోర్టు ఉత్తర్వులకు లోబడే హక్కులు ఉంటాయనే షరతుతో పేదలకు పట్టాలిచ్చారు. వారికి పట్టాలిచ్చిన చోట అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు వంటి మౌలిక వసతులు కల్పించాల్సిందే. దానికి రాష్ట్ర ప్రభుత్వం విడిగా నిధులు కేటాయించి, పనులు చేపడితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు నిధులతో అక్కడ అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు నిర్మిస్తామని చెప్పడం.. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్ని మోసం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన 500 కోట్ల రూపాయలను టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్ర వాటా నిధుల్నీ 2022 మార్చి 31లోగా సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 150 కోట్ల రూపాయలు జమ చేయకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించింది.