Amaravati Padayatra: ఆరంభం నుంచీ అడ్డంకులు, ఆంక్షలను ఎదుర్కొంటూ వస్తున్న రాజధాని రైతుల అమరావతి నుంచి అరసవల్లి మహాపాదయాత్రకు ప్రకటించిన తాత్కాలిక విరామం.. మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. 41వ రోజున రామచంద్రాపురంలో పాదయాత్ర ప్రారంభానికి ముందు పోలీసులు.. రైతులు బస చేస్తున్న కల్యాణ మండపాన్ని చుట్టుముట్టారు. అంతకు ముందు రోజున పసలపూడిలో.. పోలీసులు అడ్డగించడం వల్ల జరిగిన తోపులాటలో పలువురు మహిళా రైతులు గాయపడ్డారు. పాదయాత్రకు వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకనే.. ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్న రైతులు.. అందుకు అనుగుణంగా న్యాయస్థానం నుంచి మరోసారి స్పష్టత తెచ్చుకోవాలని యోచిస్తున్నారు.
వరుస సెలవుల అనంతరం.. 27వ తేదీన హైకోర్టు తిరిగి ప్రారంభం కానందున.. అదే రోజు పిటిషన్ వేయాలని ఐకాస భావిస్తోంది. రాజధానికి భూములిచ్చి రోడ్డున పడ్డ తాము.. అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టేందుకే.. పాదయాత్ర చేస్తున్నామని గుర్తుచేస్తున్నారు. ప్రజలు సంఘీభావం తెలపడానికి వీల్లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించిన రైతులు.. ఇక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అమరావతికి ప్రజామద్దతు కోసమే పాదయాత్రలో ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు తిరిగేలా రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేస్తున్నారు.
పాదయాత్రకు విరామం ప్రకటించిన రోజే.. గద్దె ప్రభావతమ్మ అకాల మరణం చెందడాన్ని.. రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన నాటి నుంచి తుదిశ్వాస వరకూ ప్రభావతమ్మ కనబరిచిన అంకితభావాన్ని గుర్తుచేసుకుని రైతులు ఎంతో బాధపడుతున్నారు. మందడం గ్రామానికి చెందిన ప్రభావతమ్మ.. తనకున్న అర ఎకరం భూమిని.. రాజధానికి ఇచ్చేశారు. అమరావతి సంకల్పంలో భాగంగా.. వైష్ణవీ దేవి దర్శనం కోసం.. జమ్ముకశ్మీర్ వరకూ వెళ్లొచ్చారని కుటుంబసభ్యులు తెలిపారు. ఉద్యమం ప్రారంభం నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర వరకు.. ఆమె చూపిన తెగువ మరువలేనిదని రైతులు.. గుర్తుచేసుకున్నారు.
పాదయాత్రలో తీవ్రంగా గాయపడిన తుళ్లూరుకు చెందిన అన్నపూర్ణమ్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆమె పోలీసులపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఇంతవరకూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవటాన్ని రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఇవీ చదవండి: