Amaravati Farmers Praja Chaitanya Padayatra: R-5 జోన్‌పై రాజధాని రైతులు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. R-5 జోన్ పరిధి ప్రాంతాల్లో ప్రజాచైతన్య పాదయాత్ర చేపట్టారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో రైతుల పాదయాత్ర సాగుతుంది. కృష్ణాయపాలెం, మందడం, ఐనవోలు, కురగల్లు మీదుగా నిడమర్రు వరకు నడవనున్నారు. సాయంత్రం నిడమర్రులో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో.. అమరావతిని నాశనం చేసే కుట్ర జరుగుతోందని అన్నదాతలు మండిపడుతున్నారు.
జంగిల్ క్లియరెన్స్ పనులు.. రైతుల ఆగ్రహం: ఆర్ 5 జోన్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తొలుత ఆర్ 5 జోన్ ప్రకటించి రాజధాని రైతులకు ఆగ్రహం తెప్పించిన ప్రభుత్వం.. తాజాగా ఆ జోన్లో పనులు మొదలు పెట్టింది. దీంతో రాజధాని రైతులు మరింత మండిపడ్డారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ప్రభుత్వం తొందరపాటు చర్యలు తీసుకుంటుందని అన్నదాతలు అంటున్నారు.
రాజధాని అమరావతిలో స్థానికులకు కాకుండా ఇతరులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాజధాని రైతులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మే మొదటి వారానికల్లా పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం గడువు విధించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో అధికారులు జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. కొద్ది రోజుల నుంచి ముళ్ల కంపలను తొలగించి, భూములను చదును చేస్తున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఐనవోలు సహా వివిధ గ్రామాల్లో రైతులు నిరసనలు చేశారు.
అదే విధంగా నిడమర్రులో పనులను అడ్డుకున్న వారిని అరెస్టు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో అమరావతిని నాశనం చేసే కుట్ర జరుగుతోందని.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఆర్డీఏ చర్యలు కోర్టు ధిక్కరణేనని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా తీర్పు రాకముందే పనులు చేపట్టేంత తొందరేంటని నిలదీశారు. అన్నదాతలకు, పేదలకు మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు. దీంతో ఆర్5 జోన్‌కు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను తీవ్రతరం చేస్తూ నేడు 'ప్రజాచైతన్య యాత్ర' చేపట్టాలని రాజధాని రైతు ఐకాస నిర్ణయించింది.
అసలు ఏంటి ఈ ఆర్ 5 జోన్: రాజధాని మాస్టర్ ప్లాన్‌లో వైసీపీ ప్రభుత్వం మార్పులు చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సవరించవద్దని..హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పినా.. దాన్ని సవరిస్తూ ఆర్-5 జోన్ పేరిట కొత్త నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు,కురగల్లు.. తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 900 ఎకరాలతో.. R5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు అమలుచేసేందుకు ఆర్ధికంగా బలహీన వర్గాల వారికి.. రాజధాని ప్రాంతంలో నివాస గృహాలు ఇచ్చేందుకు ఆర్ -5 జోన్ అని ప్రభుత్వం చెప్పింది.
ఇవీ చదవండి: