Amaravati Farmers : వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరును రాజధాని రైతులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సీఆర్డీఏ చట్టాన్ని సవరించి ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం ఉగాది సందర్భంగా రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా మందడంలో అమరావతి రైతులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమంలో అశువులు బాసిన వారికి నివాళులర్పించారు. పండుగ వేళ కూడా రాజధాని రైతులను ప్రశాంతంగా ఉండనీయకుండా ప్రభుత్వం అలజడి సృష్టిస్తోందని రాజధాని రైతులు ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇలా ఇష్టమొచ్చినట్లు గెజిట్ జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వారు అన్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. రాజధాని విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత ప్రభుత్వం ఇలాంటి చట్ట సవరణలు చేయడం ధిక్కరణకు కిందకు వస్తుందని హైకోర్టు న్యాయవాది చిగురుపాటి రవీంద్ర అభిప్రాయపడ్డారు. ఇక్కడ పేద వర్గాల వారిని గృహ ప్రవేశం చేయించలేని వారికి జోన్-5 సృష్టించడానికి అర్హత లేదని రాజధాని రైతు ఐకాస నేత నరసింహారావు అన్నారు.
"గ్రామ సభలు పెట్టారు. ఊరురూ ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని తిప్పి కొట్టారు. మళ్లీ సీఆర్డీఏ విజయవాడకు పిలిపించి ఎంక్వైరీ పెట్టారు. ఆ ఎంక్వైరీలో కూడా 29 గ్రామాల్లోని ప్రతి ఒక్క రైతు, వేలమంది అక్కడికి వెళ్లి పెట్టొదని చెప్పారు. ప్రభుత్వం వినకుండా కక్ష సాధింపు చర్యగా ముందుకు వెళ్తోంది. అమరావతే లేనప్పుడు ఇక్కడ ప్లాన్ మార్చాల్సిన అవసరం ఏముంది? " - మల్లిశ్వరి, రాజధాని రైతు
"ఇక్కడ పేద వర్గాల వారిని గృహ ప్రవేశం చేయించలేని నువ్వు.. ఈరోజు జోన్-5 సృష్టించడానికి నీకు అర్హత లేదు." - నరసింహారావు, రాజధాని రైతు ఐకాస నేత
"కేబినేట్ మీటింగ్ ద్వారా గానీ, మంత్రుల సెక్రటరియట్ నుంచి గానీ చాలా మార్పులు జరిగాయి. మనకు రెండు ప్రధాన చట్టాలు ఉన్నాయి. ఏపీ రీఆర్గనైజ్ యాక్ట్ 2014 అలాగే ఏపీ సీఆర్డీఏ యాక్ట్ 2014. మొదటిది పార్లమెంట్లో మనకు ప్రారంభమైనది. పార్లమెంట్లో చట్టపరచిన చట్టం అది. రెండోది మన స్టేట్ అసెంబ్లీ అంటే గత ప్రభుత్వం ద్వారా బయటకు వచ్చినది. ఈ రెండు చట్టాలు కూడా మనకు రెండు గొడుగులు లాంటివి. పార్లమెంట్ పరంగా మనకి రాష్ట్రానికి రాజధాని పెట్టుకోమన్నది. అలాగే ఆ రాజధానికి టౌన్షిప్ పెట్టుకోమన్నది. ఆ ప్రకారంగానే చేసుకుంటున్నాము. అయితే ప్రభుత్వం మారింది.. వాళ్లు అనేక మార్పులు తేవడానికి ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు అన్నీ చెల్లవు. " - రవీంద్ర, హైకోర్టు న్యాయవాది
ఇవీ చదవండి