అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ సెంటర్ నుంచి శంకర్ విలాస్ కూడలి వరకు ఈ కార్యక్రమం చేపట్టారు. మూడు రాజధానులు వద్దు - అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం శంకర్ విలాస్ కూడలి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు నిలువరించారు. రహదారిపైన నిరసనలు చేయడానికి అనుమతి లేదంటూ బలవంతంగా వారిని లాగేశారు.
300 రోజులుగా రైతులు ప్రాణాలకు తెగించి అమరావతి కోసం పోరాటం చేస్తుంటే.. ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం దారుణమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్న చందంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదన్న ధోరణిలో ముందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని తరలిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రాజధాని పోరాటానికి కుల ముద్ర వేసి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి యావత్ ప్రజానీకం మద్దతు తెలుపుతుందన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వినుకొండలో..
వినుకొండలో అమరావతికి మద్దతుగా ర్యాలీ చేపట్టారు. రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. నరసరావుపేట తెదేపా పార్లమెంటరీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి శివయ్య స్తూపం ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీగా సాగారు.
ప్రత్తిపాడులో..
ప్రత్తిపాడులో అమరావతికి మద్దతుగా తెదేపా నాయకులు ప్రదర్శన చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారి నుంచి మరో రహదారిపై వెళ్తున్న తెదేపా నాయకులను పోలీసులు అడ్డుకుని వెనక్కి వెళ్లాలని చెప్పగా.. ఇరు వర్గాల మధ్య స్వల్ప వాదనలు జరిగాయి.
మందడంలో..
అమరావతి పరిరక్షణ యాత్ర పేరుతో రాజధాని రైతులు నిర్వహించిన ర్యాలీ ముగిసింది. తుళ్లూరు నుంచి ప్రారంభమైన ర్యాలీ మందడంలో ముగిసింది. తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి మీదుగా ర్యాలీ నిర్వహించారు. సుమారు 4వేల మంది రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. దారిపొడవునా జై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు.
తాడికొండలో..
మూడు రాజధానులు వద్దు- అమరావతి ముద్దు అంటూ గుంటూరు జిల్లా తాడికొండ, పొన్నెకల్లు గ్రామస్లులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. అమరావతి జేఏసీకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేపట్టారు. ఒకే రాష్ట్రం. ఒకే రాజధాని ఉండాలని నినాదాలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయం మార్చుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని రైతులను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
చిలకలూరిపేటలో..
అమరావతికి మద్దతుగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన సెంటర్లో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి జేఏసీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా ,కాంగ్రెస్, సీపీఐ, సిపిఎం, నవతరం, జనక్రాంతి, లోక్సత్తా తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: