రాజధాని ప్రాంతంలో 75 రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. 3 రాజధానులకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం నుంచి సుమారు 50 మంది మహిళలు లక్షా యాభై వేల రూపాయలు విరాళాలు సేకరించారు. 'అమరావతి ముద్దు-మూడు రాజధానులు వద్దు' అంటూ నినాదాలు చేస్తూ అమరావతికి చేరుకున్నారు.
'వంటావార్పు'
మందడంలో మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. రైతులు రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
'అప్పటిదాకా ఉద్యమిస్తాం'
ప్రభుత్వం అమరావతి రైతులను రోడ్డుపైకి నెట్టేసిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. రైతులను ఆదుకోవాలని స్థానిక నేతలను అడిగినందుకు తమపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని ప్రకటించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
'రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ చేపడతాం'
అమరావతి ఉద్యమానికి మద్దతుగా గుంటూరు నాన్ పొలిటికల్ ఐకాస వినూత్న కార్యక్రమం చేపట్టింది. గుంటూరు నుంచి 150 మంది సైకిల్‌పై బయలుదేరి తూళ్లురు దీక్షా శిబిరానికి వెళ్లారు. ఉద్యమానికి తమవంతు సాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న యువత సహకారంతో అన్ని ప్రాంతాల్లో సైకిల్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
గుంటూరు ఐకాస ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు ఐకాస ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరాహారదీక్షలను మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ, సీపీఐ నాయకులు కోటా మల్యాద్రి ప్రారంభించారు. సీఎం జగన్ తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే 3 రాజధానులు వంటి పిచ్చి నిర్ణయాలను తెరపైకి తీసుకువచ్చారని నక్కా ఆనందబాబు ఆరోపించారు.
కృష్ణాయపాలెంలో రైతులు, మహిళల 'రివర్స్' నడక
మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రులో రైతులు ఆందోళనలు కొనసాగించారు. కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు 'రివర్స్' నడక నిర్వహించారు. సుమారు కిలోమీటరుకుపైగా రైతులు, మహిళలు రివర్స్ నడక నడిచారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ తీసుకునే నిర్ణయాలన్నీ రివర్స్‌గానే ఉన్నాయన్న సంకేతం ఇవ్వాలనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని రైతులు తెలిపారు.
ఇవీ చదవండి