గుంటూరు జిల్లాలో...
మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాల్లో రైతుల రణభేరి ఉత్సాహంగా సాగింది. మంగళగిరిలో తెదేపా, వామపక్ష నాయకులు ఎన్టీఆర్ క్యాంటీన్ వద్ద ధర్నా నిర్వహించారు. పళ్లెం, గరిటెలు మోగించి నిరసన తెలిపారు. పట్టణంలో మహిళలు భిక్షాటన చేపట్టారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో రైతులు శంఖాన్ని ఊది రణభేరిని ప్రారంభించారు. అమరావతి అన్నదాల ఆక్రందన పేరుతో రైతులు రోడ్డుపై కాడెద్దులు, గొర్రెలతో నిరసన తెలియజేశారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములిస్తే తమను రోడ్డు పాలు చేసిందని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్ధండరాయునిపాలెం లో రైతులు దీక్షా కొనసాగించారు. రాయపూడి లో రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా నాయకులు చెవిలో క్యాలిఫ్లవర్ పెట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. ముఖ్యమంత్రలు, పాలకులు శాశ్వతం కాదని.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే శాశ్వతమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరసరావుపేట జేఏసీ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజధాని రైతుల దీక్షను ప్రభుత్వం గుర్తించాలని, రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ప్లకార్డుల ద్వారా నినాదాలు చేశారు.
తాడికొండ, మేడికొండూరు, ఫిరంగీపురం మండలాల్లోని గ్రామాల్లో తెదేపా కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. అమరావతి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రకాశం జిల్లాలో...
కనిగిరి తెదేపా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాజిక దూరం పాటిస్తూ... ప్లకార్డులు పట్టుకొని నిరసన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి... రాజధాని అమరావతికి మద్దతిచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో...
చిత్తూరులోని గాంధీ విగ్రహం ఎదుట తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. జాతీయ జెండాలతో నిరసన తెలిపారు. ఆంధ్రుల రాజధాని అమరావతి ఒక్కటేనని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని..వికేంద్రీకరణతో అభివృద్ధి శూన్యమని అన్నారు. రాష్ట్ర రాజధాని గా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే రమేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి పరిపాలన చేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
కర్నూలు జిల్లాలో...
అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కర్నూలులో తెదేపా కార్యాలయం ముందు పార్టీ నాయకులు ధర్నా చేశారు. 250 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో...
రాజధాని మార్చే అధికారం ఏ ఒక్కరికీ లేదని తేదేపా కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్, రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రజలందరూ మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లాలో...
హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద తేదాపా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతూ కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో...
అమరావతి రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమ 250 రోజులకు చేరటంతో నెల్లూరులో తెదేపా నేతలు సంఘీభావం ప్రకటించారు. వెంకటాచలం మండలం అనికేపల్లి, కోవూరు మండలంలో తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: