Agitations Against CBN Arrest in All Over AP: చంద్రబాబు అరెస్టు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తమ అధినేతను విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళనలను నిర్వహిస్తూనే ఉన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని.. ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ టీడీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసనలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
విశాఖ జగదాంబ సెంటర్ వద్ద టీడీపీ నేత గండి బాబ్జి నేతృత్వంలో ఆందోళన చేశారు. మోకాలుపై కూర్చుని, నల్ల బెలూన్లు ఎగుర వేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన నిర్వహించారు. చంద్రబాబుకు న్యాయం జరగాలని న్యాయదేవతకు పూజలు చేశారు.
చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో తెలుగు మహిళలు దుర్గాదేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు గ్రామంలో బాబుతో మేము కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తుందని నాయకులు ప్రజలకు వివరించారు.
చేయని తప్పులను చంద్రబాబుపై మోపి జైలులో ఉంచడాన్ని ఖండిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని వైయస్సార్ రోడ్లో సీనియర్ టీడీపీ నాయకులు గత 35 రోజులుగా రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు చెరసాలలో ఉన్నట్లుగా టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ బాబు జైలు నుండి కడిగిన ముత్యంలా బయటకు వచ్చేంతవరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు.
Pujas About Chandrababu in AP: చంద్రబాబు నాయుడు కోసం టీడీపీ నేతల ప్రత్యేక పూజలు..
టీడీపీ అధినేత చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా.. అరెస్టు చేసిన విషయం కూడా తనకు తెలియదని జగన్ రెడ్డి అనడం ఏమాత్రం సబబుగా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని చంద్రబాబు వద్ద క్షమాపణ కోరి.. వెంటనే విడుదల చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ కర్నూలులో నిరసనలు కొనసాగుతున్నాయి. చెత్తపైన పన్ను వేసిన ముఖ్యమంత్రి.. భవిష్యత్‌లో తలవ్రెంటుకలపై కుడా పన్ను విధిస్తారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరగుండు గీయించుకొని నిరసన తెలిపారు. టీడీపీ రాష్ట్ర నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్పై మహిళలు పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి ముఖ్యమంత్రి ఆనందపడుతున్నారని న్యాయస్థానంలో చంద్రబాబుకి న్యాయం జరుగుతుందని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని నూతన వధూవరులు రూపా దేవి, లీలాధర్ సాయి కృష్ణలు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో తోట సీతారామయ్య కుమార్తె వివాహ వేడుక నిర్వహించగా.. ఆ వేడుకకు మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యతో పాటు స్థానిక టీడీపీ నేతల హాజరయ్యారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ ప్లకార్డులు చేతబట్టి కల్యాణ వేదికపైనే నిరసన వ్యక్తం చేశారు.
సైకో జగన్ రెడ్డి తన పైశాచిక ఆనందం కోసం చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం నిజంగా దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజానీక ఆశీస్సులతో చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో, కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
TDP Agitations on CBN Arrest: బాబు అరెస్టుపై నిరసన జ్వాలలు.. విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణుల డిమాండ్