భూమికి సంబంధించిన రికార్డుల స్వచ్ఛీకరణను ప్రభుత్వం చేపట్టింది. దశాబ్దాలుగా రెవెన్యూ దస్త్రాల్లో జరుగుతున్న మార్పులతో అనేక తప్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని సర్వే నంబర్లలో భూమి మీద ఉన్న విస్తీర్ణం కంటే రికార్డుల్లో ఎక్కువగా నమోదుకావడం పలు వివాదాలకు కారణమవుతోంది. ఆర్‌ఎస్‌ఆర్(రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్)కు, వెబ్‌ల్యాండ్‌లో ఉన్న విస్తీర్ణానికి చాలా సర్వే నంబర్లలో పొంతన కుదరడం లేదు. రెవెన్యూ అధికారులు పని ఒత్తిడిలో చేసిన తప్పులు, క్షేత్రస్థాయిలో కొందరు చేసిన అక్రమాలతో రికార్డులు తప్పులతడకగా తయారయ్యాయి. పట్టాదారు పాసు పుస్తకాల్లో నమోదు చేసిన విస్తీర్ణానికి, రైతు సాగులో ఉన్న విస్తీర్ణానికి ఎక్కువగా తేడాలు ఉన్నాయి. కాలువలు, రహదారులు, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసి యజమానులకు పరిహారం చెల్లించినా రికార్డుల్లో ఇంకా వారి పేర్లే ఉన్న సందర్భాలున్నాయి. రికార్డులను నవీకరించకపోవడం వల్ల పలు సమస్యలు వస్తున్నాయి. భూ యజమానులు తప్పులు సరిదిద్దాలని ఏళ్ల తరబడి తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు.
వీటిన్నింటికీ పరిష్కారంగా కొన్నేళ్లుగా రికార్డుల స్వచ్ఛీకరణ చేయాలనే డిమాండ్ ఉంది. మాన్యువల్ ఆర్‌ఎస్‌ఆర్‌లో వివరాల ఆధారంగా ప్రస్తుత వెబ్‌ల్యాండ్ వివరాలు సరిచేయడంతోపాటు భూమి స్వభావం, వర్గీకరణ, పట్టా, ప్రభుత్వ భూములు, మిగులు భూములు ఇలా అన్ని వివరాలు సరిచేసి డిసెంబరు 31నాటికి గుంటూరు జిల్లాలో పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా యంత్రాంగం ఆదేశించింది.
అందరి భాగస్వామ్యంతో అమలు..
రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో), గ్రామ సర్వేయరు(వీఎస్) క్షేత్రస్థాయిలో రికార్డులకు అనుగుణంగా వివరాలు ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించాలి. ఈ వివరాలను ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్న వివరాలతో సరిపోల్చుకోవాలి. ఆర్‌ఎస్‌ఆర్‌కు ప్రస్తుత వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలు పరిశీలించి తప్పులు, సవరణలు గుర్తించి రికార్డుల ఆధారంగా స్వచ్ఛీకరణ చేయాల్సిన అంశాలను గుర్తిస్తారు. ఆర్‌ఎస్‌ఆర్ ఆధారంగా గ్రామ రెవెన్యూ అధికారి సర్వే నంబరు, సబ్ డివిజన్లు సరిచూస్తారు. భూమి మొత్తం విస్తీర్ణం, భూ స్వభావం, వర్గీకరణ, పట్టాదారు పేర్లు, ఇతర వివరాలు సరిచూసి నివేదిక తయారు చేస్తారు. గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు సమన్వయంతో పని పూర్తిచేయాలి. ఇద్దరూ రికార్డులు పరిశీలించి రెవెన్యూ ఇన్‌స్పెక్టరు, ఉప తహశీల్దారు, మండల సర్వేయరుకు నివేదిక ఇస్తారు. వీరంతా బృందంగా వంద శాతం రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా అవసరమైన మార్పులను ఆర్‌ఎస్‌ఆర్, వెబ్‌ల్యాండ్‌కు అనుగుణంగా మార్పులు సూచిస్తూ వివరాల నమోదుకు సిఫార్సు చేస్తారు. రికార్డులను తహశీల్దార్లు తనిఖీ చేసి వివరాలు నమోదు చేస్తారు. తహశీల్దార్లు సర్వే నంబర్లు, సబ్‌డివిజన్, మొత్తం విస్తీర్ణం, పట్టాదారు పేర్లు మార్పులు చేసే వెసులుబాటు కల్పించారు. రికార్డుల్లో భూమి స్వభావం, వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంటే సంబంధిత రికార్డులను తహశీల్దార్లు ఆర్డీవో, సబ్‌కలెక్టర్‌కు పంపుతారు. వారు రికార్డులు పరిశీలించి ఏమేమి మార్పులు చేయాలో సూచిస్తూ సంయుక్త పాలనాధికారికి పంపుతారు. సంయుక్త పాలనాధికారి రికార్డులు పరిశీలించి ఆమోదించడం, లేదా తిరస్కరించడం చేస్తారు. ఇలా చేసిన మార్పులను అన్ని రికార్డులతో పాటు ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదు చేయాలి. ఈమొత్తం ప్రక్రియను డిసెంబరు నెలాఖరుకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవీ చదవండి: