ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అవినీతి నిరోధక శాఖ (అనిశా) ఇంకా విచారిస్తోంది. గుంటూరు జీజీహెచ్‌లో ఇవాళ ఉదయం రెండున్నర గంటలపాటు విచారించిన అధికారులు... అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు. విచారణ ముగిసిందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా సాయంత్రం మళ్లీ జీజీహెచ్‌కు అనిశా అధికారులు తిరిగి వచ్చారు. అచ్చెన్నాయుడి విచారణకు ఇంకా సమయం ఉందని వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకు సాంకేతికంగా గడువు ఉందని అనిశా అధికారులు చెబుతున్నారు.
ప్రధానంగా ఈఎస్‌ఐ టెలీ హెల్త్ సేవలకు సంబంధించి టెండర్లపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రాసిన సిఫార్సు లేఖపై అనిశా అధికారులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న టెలీ హెల్త్ సేవలను అధ్యయనం చేయాలనే తాను సూచించానని... పలానా కంపెనీకి కేటాయింపులు జరపమని లేఖలో చెప్పలేదని అచ్చెన్నాయుడు వివరించినట్లు సమాచారం. అయితే అచ్చెన్నాయుడు విచారణలో మనసు విప్పి మాట్లాడటం లేదని అనిశా అధికారులు భావిస్తున్నారు. విజయవాడలో మిగతా నలుగురు నిందితులను కూడా వేర్వేరుగా అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు అచ్చెన్నాయుడు రిమాండ్ గడువు జులై 10 వరకు పొడిగించింది కోర్టు. కస్టడీ సమయం సాయంత్రం ఐదు గంటలకే ముగిసింది. జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడిని ఎప్పుడు డిశ్ఛార్జి చేస్తారనేది వెల్లడి కావాల్సి ఉంది. శస్త్ర చికిత్స గాయం నుంచి దాదాపుగా కోలుకున్న అచ్చెన్నాయుడు.. ప్రస్తుతం నడుంనొప్పి, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి