Tension in Nuziveedu YCP Activists Threw Stones at Yuvagalam Padayatra: ఉమ్మడి కృష్ణాజిల్లాలో లోకేశ్ పాదయాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. అడుగడుగునా వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు.. టీడీపీ శ్రేణులపై దాడి చేసినా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా దాడులపై ఫిర్యాదు చేసిన తమపైనే కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 194వ రోజు యువగళం పాదయాత్ర జన నీరాజనాల మధ్య ప్రారంభమయ్యింది. మీర్జాపురం నుంచి గొల్లపల్లి, మొరసపూడి, తుక్కులూరు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం (YSRCP Leaders Attack on TDP Leaders) తలెత్తింది. పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులు తమ పార్టీ జెండాలు పట్టుకొచ్చారు. వారిని పోలీసులు నియంత్రించలేదు. వైసీపీ శ్రేణుల్ని ప్రతిఘటించేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులపై పోలీసు జులుం ప్రదర్శించారు. పోలీసులు టీడీపీ శ్రేణులపైనే లాఠీలు ఝళిపించారు. పోలీసులు వైసీపీ శ్రేణులకు సద్దిచెప్పి జాగ్రత్తగా అక్కడి నుంచి పంపారు.
Tension at Nuziveedu : తుక్కులూరు వద్ద ఘర్షణకు అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు ముందస్తుగానే డీఎస్పీకి సమాచారం ఇచ్చినా, డీఎస్పీ అక్కడ ఉండి వైసీపీ కవ్వింపు చర్యలను పర్యవేక్షించారనిస, అక్కడ నుంచి వారిని పంపే ప్రయత్నం ఎంత మాత్రం చెయ్యలేదు టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ శ్రేణులపైకి రాళ్లు, జెండా కర్రలు విసిరి దాడులకు తెగబడుతున్నా చోద్యం చూసిన పోలీసులు ప్రతిఘటించేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులపై మాత్రం తమ ప్రతాపం చూపించారని అంటున్నారు. సంఘటనా స్థలంలోనే ఉన్న డీఎస్పీ తెలుగుదేశం శ్రేణులపైకి తన సిబ్బందిని ఉసిగొల్పుతున్న తీరు విమర్శలకు తావిచ్చింది.
ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసుల నిరాకరణ : నూజివీడు ఘర్షణపై పోలీసులకు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల వద్ద ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ ఎదుట నేతలు, శ్రేణులు ధర్నాకు దిగడంతో పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పోలీసులకు జవాహర్ తనయుడు కొత్తపల్లి ఆశీష్, గిరిజన నేత వెంకటప్ప ఫిర్యాదు చేశారు. నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు బైపాస్ జంక్షన్ వద్ద వైసీపీ నేతలు పాలడుగు విజయ్ కుమార్ , యలమర్తి చిట్టిబాటు, కొండాలి వెంకటేశ్వరరావు, రాజ మరికొందరు ఉద్దేశ్యపూర్వకంగా పాదయాత్రలోకి చొరబడి బీరు సీసాలు, రాళ్లు పట్టుకుని దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీడీపీ నేతలపై పిడిగుద్దులు : వైసీపీ జెండాలతో కూడిన పదునైన ఇనుపరాడ్లు పట్టుకుని వచ్చిన పాలడుగు విజయ్ కుమార్, కొడాలి వెంకటేశ్వరరావులు లోకేశ్, చంద్రబాబులను అసభ్య పదజాజంతో మాట్లాడారని ఫిర్యాదులో తెలిపారు. ఎస్సీ, ఎస్టీలమైన తమను కులం పేరుతో బూతులు తిట్టి దాడి చేశారని వాపోయారు. చంపండ్రా అంటూ హత్యాయత్నం చేసి.. కింద పడేసి తమ పై పడి పిడిగుద్దులు గుద్దారని టీడీపీ నేతలు ఆక్షేపించారు. అడ్డుకునే యత్నించిన బడిపాటి ప్రభాకర్ రావు, కారుమంచి రాజ, మేకూరురాజ, కారుమంచి కిరణ్ తదితరులుపైనా కూడా దాడి చేశారన్నారు. తమను కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన వైసీపీ శ్రేణులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు ప్రతులను తెలుగుదేశం నేతలు జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు పంపారు.
లోకేశ్ పాదయాత్రకు మాత్రం అడుగడుగునా జననీరాజనం లభించింది. మీర్జాపురం నుంచి గొల్లపల్లి, మొరసపూడి, తుక్కులూరు వరకు చేరుకున్న లోకేశ్, భోజన విరామం అనంతరం నూజివీడు, చిన్నగాంధీబొమ్మ సెంటర్, పొట్టి శ్రీరాములు విగ్రహం, పెద్ద గాంధీబొమ్మ సెంటర్ మీదుగా పోతిరెడ్డిపల్లి వరకూ తన పాదయాత్ర సాగించారు. రహదారులపై బారులు తీరి లోకేశ్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అన్ని గ్రామాలు, నూజివీడు పట్టణంలో పసుపు జెండాలు రెపరెపలాడాయి.
ఎక్కడ చూసినా కనీవినీ ఎరగని రీతిలో స్వాగతాలు.. అడుగడుగునా అభిమాన హారతులు పడుతూ, జనం యువనేత లోకేశ్‌తో పాదం కలిపారు. గళం జోడించి జేజేలు కొట్టారు. రహదారులు కన్పించని విధంగా పూలజల్లులు కురిపిస్తూ, గజమాలలతో ఘన స్వాగతం పలికారు. యువగళం పాదయాత్రలో ప్రజలకు కరచాలనం చేస్తూ, వివిధ వర్గాల నుంచీ వినతులు స్వీకరించే ప్రక్రియలో లోకేశ్ చేతికి గాయాలయ్యాయి. దీంతో లోకేశ్ చేతికి వైద్యులు బ్యాండేజ్ వేశారు.