Woman Relatives Protest: ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పెట్టిన మహిళ మృతదేహాన్ని ఎలుకలు కొరికాయని మృతురాలి బంధువులు శవపరీక్ష కేంద్రం వద్ద ఆందోళన చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
అసలేం జరిగిందో బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడిలోని ముదిరాజుల కాలనీకి చెందిన కృష్ణవేణికి.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామానికి చెందిన తిట్ల వెంకటేశ్వరరావుతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. అప్పటి నుంచి వారికి సంతానం కలుగలేదు. దీంతో ఇటీవల భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. అయితే కృష్ణవేణి తమ్ముడు నిశ్చితార్థం సందర్భంగా మూడు రోజుల కిందట చింతలపూడిలోని తన పుట్టింటికి వచ్చింది. బుధవారం నిశ్చితార్థం అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఆ దంపతుల మధ్య రాత్రి పిల్లల ప్రస్తావన వచ్చింది. అప్పటికే సంతానం కలగడంలేదని మనస్తాపంతో ఉన్న కృష్ణవేణి గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఉదయం పోస్టుమార్టం కోసం వచ్చిన బంధువులు కృష్ణవేణి మృతదేహాన్ని చూసి.. ఆమె చేతిపై, ముఖంపై గాయాలుండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఎలుకలు మృతదేహాన్ని కొరికాయని వాగ్వావాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతలపూడి ఎస్సై హరికృష్ణ తెలిపారు.
కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రసూల్ మాట్లాడుతూ.. శవ పరీక్ష కేంద్రంలో జనరేటర్ సౌకర్యం లేదని గురువారం రాత్రి విద్యుత్ అంతరాయం కలగడంతో సిబ్బంది రెండు మూడు సార్లు ఫ్రీజర్ పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ సమయంలో మృతదేహంపై గాయాలయ్యాయని.. అంతే తప్ప ఎలుకలు దాడి చేయలేదని అన్నారు. దీనిపై కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నగదు డిమాండ్ చేసినట్లు తన దృష్టికి రాలేదని, దానిపై విచారించి నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని డీసీహెచ్‌ఎస్ ఏవీఆర్ మోహన్ తెలిపారు.
ఇవీ చదవండి: