Polavaram residents Dharna: కాంటూర్లతో సంబంధం లేకుండా పోలవరం నిర్వాసితులు అందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని.. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ డిమాండ్ చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటూ పోలవరం నిర్వాసితులు.. ఏలూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. 45వ కాంటూరు వరకూ పోలవరం నిర్వాసితులు నష్టపోతున్నా.. లైడార్ సర్వేల పేరుతో మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతేడాది వచ్చిన వరదలకే పోలవరం 45.5 కాంటూరు పరిధిలోని 300 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయని.. అవన్నీ పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాకి లెక్కలు చెబుతూ అందరినీ మభ్యపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. బాధితులకు పూర్తిగా పరిహారం అందాకే ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు.. నీళ్లు నింపాలని ఆయన సూచించారు.
పునరావాసం విషయంలో మోసం చేస్తున్నారు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుందని ముంపు గ్రామాల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంటూరి లెక్కల పేరుతో నష్టపరిహారం, పునరావాసం విషయంలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న విధంగా కాలనీల్లో మౌలిక వసతుల కల్పన జరగాలన్నారు. నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్వాసితులు గొంతెత్తారు.
కాంటూరి లెక్కలతో సంబంధం లేకుండా.. పరిహారం చెల్లించాలి.. కాంటూరి లెక్కల పేరుతో పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపునకు గురవుతున్న కొన్ని గ్రామాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకున్నవారే లేరని వాపోయారు. రెండు మూడు నెలలు కొండలపై పరదాల్లో ఉండి, తాగునీటికి, ఆహారానికి సైతం అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.. గిరిజనుల సాగులో ఉన్న అన్నిరకాల భూములకు భూమికి భూమి, పరిహారం ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 1986, 2022 వరద ముంపు ఆధారంగా రీసర్వే చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా సీఎం జగన్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు 10.50 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు.
కాంటూరు లెక్కలు దొంగ లెక్కలు.. కాకి లెక్కలు అవన్నీ పక్కన పెట్టి ఏదైలే 41.15 మీటర్లకు నీరు నిల్వ చేయాలనుకుంటున్నారో.. ఇంకా మొన్న వచ్చిన వరదకి పదహారన్నర అడుగుల ఖాళీ ఉంది.. మునిగిన ప్రతీ గ్రామాల్లో మార్కింగ్ ఉంది.. అక్కడి నుంచి కనీసం 10, 12 అడుగులు ఎత్తు తీసుకుని ఎక్కడ వరకు మునిగిమదో తేల్చుకుని.. అన్ని గ్రామాల లెక్కలు తెచ్చి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేసి నిర్వరాసితులకు న్యాయం జరిగాకే నీరు నిల్వ చేసి ఆ తర్వాత మీరు చేయాలి.. అంతే కాకుండా మీరు ఏది చేసినా గిరుజనులకు అన్యాయం చేసిన వారు అవుతారు.- షేక్ సాబ్జీ, ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: