Polavaram Nirvasitula Problems: పోలవరం నిర్వాసితులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కొందరికి పరిహారం అందక అవస్థలు పడుతుంటే.. నిర్వాసిత గ్రామంలో ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు హుకుం జారీ చేశారు. ఏటా గోదారి వరదలతో ముంపు ప్రాంతంలో ఉండలేక నిర్వాసిత గ్రామాల్లో తలదాచుకుంటుంటే.. ఇప్పుడు వెళ్లిపొమ్మనడం ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీళ్లంతా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం చిగురుమామిడి గ్రామస్థులు. గోదావరి వరదలతో ముంపునకు గురయ్యే గ్రామాల్లో చిగురుమామిడి ఒకటి. గత సంవత్సరం గోదావరికి భారీగా వరదలు రావడంతో.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి పునరావాస గ్రామంలో ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది. 10 నెలలుగా ఈ కాలనీలోనే నివాసం ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ.. ఉన్న ఫళంగా ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంతో తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే సర్వం కోల్పోయామని.. పునరావాస కాలనీ నుంచి కూడా వెళ్లిపోమంటే ఎలాగని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
"ముంపు ప్రాంతాల్లోంచి ఇక్కడికి పంపించారు. పంపించి పట్టాలు ఇచ్చారు. రెండు ఇళ్లులు పెండింగ్లో ఉన్నాయి. 10 నెలల ఆ ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపించి.. తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. మాకు పట్టా ఉన్నా కూడా వేరే వారికి ఇస్తున్నారు. మొన్న ఆర్ఐ వచ్చి ఈ పట్టాలు చూసి.. అసలు ఇవి చెల్లవు అని చెప్పారు".-నందిని, పోలవరం ముంపు బాధితురాలు
పది నెలల క్రితం అధికారులు తమకు కేటాయించిన పట్టాలు ఆధారంగా వారిచ్చిన గృహాల్లో తామంతా నివాసం ఉంటుండగా.. ప్రస్తుతం సంఖ్యలు మారాయనే నెపంతో ఇళ్లు ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారని నిర్వాసితులు వాపోతున్నారు. ఇళ్లు ఖాళీ చేయ్యాలని హుకుం జారీ చేయడమే కాకుండా.. మరో అడుగు ముందుకేసి రెండు ఇళ్లకు రెవెన్యూ అధికారులు సీల్ కూడా వేశారు. ఈ పరిణామంతో నిలువు నీడ కోల్పోయి ఆ కుటుంబీకులు రోడ్డున పడ్డారు.
"పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత ఇళ్లులు మారాలంటే మేము ఎలా మారాలి. మా సొంత డబ్బులు పెట్టుకుని ఇళ్లులు శుభ్రం చేసుకున్నాం. మాకు ప్యాకేజీ ఇస్తామన్నారు. ఇంతవరకు లేదు. ఎందుకు మారాలని అడిగితే.. ఈ ఇళ్లులు మీవి కావు.. మీది రెండో లిస్టులో ఉందని చెబుతున్నారు. మీటర్లు కూడా పెట్టలేదు. అడిగితే ఇళ్లులు మారితేనే పెడతామంటున్నారు."-పద్మ, పోలవరం ముంపు బాధితురాలు
నిర్వాసిత గ్రామంలో కేటాయించిన ఇళ్లకు.. కొందరు సొంత డబ్బులు ఖర్చు చేసి మరమ్మతులు, ఆధునికీకరణ పనులు కూడా చేయించుకున్నారు. ఇప్పుడు బయటికి వెళ్లమనడం దారుణమని బాధితులు ఆక్రోశిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు ఖాళీ చేసేది లేదని తేల్చిచెబుతున్నారు. ఇచ్చిన జాబితా ప్రకారం కేటాయించిన వాటిలోని ఉంటామని స్పష్టం చేస్తున్నారు. సర్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే కాస్త కుదురుకుంటున్న తమను.... తిరిగి అవస్థలకు గురిచేయద్దని చిగురుమామిడి నిర్వాసితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.