Poet Sirisilla Rajeshwari Passes Away : కాళ్లతోనే కవితలు రాసి ఎన్నో ప్రశంసలు అందుకున్న సిరిసిల్ల రాజేశ్వరి (44) ఇక లేరు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో తమ కుటుంబానికి కేటాయించిన రెండు పడక గదుల ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. రెండు నెలలుగా ఆమె నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెను కంటికి రెప్పలా చూసుకునే తల్లి ఇటీవల మరణించారు. సిరిసిల్ల సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరి పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఇంటర్మీడియట్ చదివిన ఆమె ఓ టీవీ కార్యక్రమంలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాటలు విని, ఆ ప్రభావంతో కాళ్లతోనే కవితలు రాయడం ప్రారంభించారు.
ఇప్పటి వరకు ఆమె మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దాశరథి, నేత కార్మికులు, కరోనా, వరకట్న వేధింపులపై కవితలు రాసి కవిత్వానికి వైకల్యం అడ్డురాదని నిరూపించారు. ఆమె సాహిత్యం, కృషిని మెచ్చిన సుద్దాల అశోక్‌తేజ సిరిసిల్ల రాజేశ్వరి అని పేరు పెట్టారు. ఆమె కవితలతో ఒక పుస్తకాన్ని అచ్చువేయించారు. ఆయన చొరవతోనే మహారాష్ట్ర ప్రభుత్వం రాజేశ్వరి జీవిత చరిత్రను తెలుగు పాఠ్యపుస్తకంలో ఓ పాఠ్యాంశంగా చేర్చి గుర్తింపునిచ్చింది.
మంత్రి కేటీఆర్ సంతాపం..: రాజేశ్వరి మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతో మందికి ఆదర్శమన్నారు. రాజేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కేటీఆర్ ప్రార్థించారు. ఆమె మృతి పట్ల జిల్లా కవులు, రచయితలు సంతాపం ప్రకటించారు.
ఇవీ చదవండి: