ఏలూరు జిల్లా ముదినేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. రహదారికి అడ్డంగా ఆటో ఉంచడంతో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ.. కత్తిపోట్లకు దారి తీసింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు గాయపడగా.. చికిత్సపొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముదినేపల్లిలో రహదారికి అడ్డంగా ఆటో ఉంచిన విషయమై తలెత్తిన వివాదంలో.. ఇర్ఫాన్ అనే వ్యక్తి.. నాగేంద్ర, మహేష్‌పై కత్తితో దాడి చేశాడని బాధితుల బంధువులు తెలిపారు. ఇర్ఫాన్‌కు సంబంధించిన 20 మంది వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేంద్ర, మహేష్‌ను తొలుత గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం, ఇవాళ తెల్లవారుజామున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు.
వీరిలో.. చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందారు. మరో వ్యక్తి మహేష్ పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. మృతుడు నాగేంద్ర మాలమహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
డీఎస్పీ పైడేశ్వరరావు: హత్య కేసును ఛేదించిన పోలీసులు... వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌తో పాటు మరో ఐదుగురు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నాగేంద్ర ఇంటి ఎదుట ఇర్ఫాన్ ఆటో నిలపడం వల్లే ఘర్షణ జరిగిందని డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు. ఘర్షణ సమయంలో చుట్టుపక్కల వాళ్లు సర్దిచెప్పారని... రాత్రి కొంతమందితో కలిసి వచ్చి ఇర్ఫాన్ మరోసారి ఘర్షణకు దిగారని చెప్పారు. ఘర్షణ సమయంలో ఇర్ఫాన్ కత్తితో నాగేంద్ర, మహేష్‌పై దాడి చేయగా... నాగేంద్ర, మహేష్ గాయపడ్డారన్నారు. వారిని ఆస్పత్రికి తరలించగా... విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందాడని డీఎస్పీ డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు.
ఇవీ చదవండి: