వారంతా వలస జీవులు... రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి వారిది. ఎక్కడ పనుంటే అక్కడికి వెళ్లి గుడారాలు వేసుకొని జీవిస్తుంటారు. వారిపై మృత్యు మేఘం కన్నెర్రజేసింది. పిడుగు రూపంలో కబళించింది. పిడుగుపాటుకు గురై నలుగురు కూలీలు మృత్యువాత పడిన ఘటన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మరో ముగ్గురు విజయవాడలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా తిరుమాలి, పోతులూరు, దానవాయిపేట తదితర గ్రామాలకు చెందిన కొందరు కూలీలు ఇటీవల లింగపాలెం మండలం బోగోలు పరిధిలోని రిజర్వు ఫారెస్టులో జామాయిల్ తోటలు నరికేందుకు వచ్చారు.
తోటల్లోనే గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసి, ఓ గుడారానికి సమీపంలో పిడుగు పడింది. అందులో 15 మంది నిద్రిస్తుండగా ఏడుగురు పిడుగు ప్రభావానికి గురయ్యారు. సహచరులు గుర్తించి అందర్నీ ట్రాక్టర్‌పై సమీపంలోని ధర్మాజీగూడెం ఆసుపత్రికి తరలించగా... వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపారు. అప్పటికే ఏలేశ్వరం మండలం తిరుమాలికి చెందిన కూనపరెడ్డి శ్రీనివాస్(20), వరుపుల ధర్మరాజు(23), ప్రత్తిపాడు మండలం పోతులూరు వాసి రాయుడు రాజు(30), తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన గుత్తుల కొండబాబు(32) మృతి చెందినట్లు నిర్ధారించారు. వీరిలో శ్రీనివాస్, ధర్మరాజు అవివాహితులు. తీవ్ర అస్వస్థతకు గురైన కె.గణేష్, అర్జున్, బుల్లియ్య విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాల సభ్యులు, బంధువులు ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్దకు వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బుధవారం సాయంత్రం వారికి అప్పగించారు.