POLAVARAM : ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేమని స్వయంగా జలవనరుల మంత్రి అంబటి రాంబాబు చాలా సార్లు చెప్పారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా 2024 లోపు పోలవరం పూర్తయ్యే అవకాశం లేదని తేల్చేసింది. అయితే ప్రాజెక్టు పనుల పురోగతిపై రాజకీయంగా పలురకాల విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాక 2014 వరకు ఏ విభాగంలో ఎంత విలువైన పని అయిందనే అంశంతో పాటు.. టీడీపీ హయాంలో, ప్రస్తుత జగన్ పాలనలో ఏ విభాగంలో ఎంత విలువైన పని జరిగిందో జలవనరులశాఖ అధికారులు తాజాగా లెక్కించారు.
పోలవరం ప్రారంభమయ్యాక... 18 ఏళ్లలో ఎప్పుడు ఎంత పనైందో ఈ లెక్కలు స్పష్టంగా వివరిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోలవరంలో అత్యధిక పురోగతి ఉందని... ఆ గణాంకాలు అధికారికంగా తేల్చిచెబుతున్నాయి. ఇప్పటికే జలవనరులశాఖలో నిధుల వినియోగం, ప్రాజెక్టు పనుల పూర్తికి సంబంధించి సాక్షాత్తూ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి... జగన్ ప్రభుత్వ హయాంలో కంటే చంద్రబాబు పాలనలోనే సాగునీటి ప్రాజెక్టులపై అధిక నిధులు ఖర్చు చేశారంటూ గణాంకాలతో సహా వెల్లడించారు.
పోలవరంలో కీలకం ప్రధాన డ్యాం నిర్మాణం. ఈ ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో అత్యధికంగా 48.97 శాతం మేర జరిగాయి. వైఎస్ హయాంలో ప్రారంభమై.. 2014 మే వరకు కేవలం 3.94 శాతం మేర మాత్రమే పనులు జరిగాయి. ప్రస్తుతం సీఎం జగన్ ప్రభుత్వంలో 25.64 శాతం వరకూ ప్రధాన డ్యాం పనులు జరిగాయి. కుడి, ఎడమ కాలువలతో కలిపి ప్రధాన డ్యాం పనులను పరిగణిస్తే.. మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలోనే 41.9 శాతం మేర పూర్తయ్యాయి. ఆ ఐదు సంవత్సరాలలోనే అత్యధికంగా పనులు జరిగినట్లు తాజా లెక్కలు తేలుస్తున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన వరకు 20.39 శాతం మేర పనులు జరిగాయి. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కేవలం 17 శాతం అంటే.. తక్కువ స్థాయిలో పనులు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భూ సేకరణ, పునరావాసం లెక్కలు సైతం ఇలాగే ఉన్నాయి. వైఎస్ హయాం నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన వరకు 3.54 శాతం మేర జరగ్గా.. చంద్రబాబు హయాంలో 12.65 శాతం వరకూ జరిగాయి. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కేవలం 5.97 శాతం వరకు మాత్రమే పనులు చేపట్టారు. ఈ లెక్కలన్నీ జలవనరులశాఖ అధికారులు తాజాగా రూపొందించినవే. అయితే 2023 జనవరి నెల చివరి వరకు పోలవరంలో జరిగిన పనులను పరిగణనలోకి తీసుకుని వీటిని తయారుచేశారు.
పోలవరంపై సీఎం జగన్‌తో పాటు మంత్రుల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. టీడీపీ హయాంలో అసలు పనులేమీ జరగలేదని, కేవలం తమ ప్రభుత్వంలోనే వేగంగా సాగుతున్నాయని ఎప్పటికప్పుడు చెబుతుంటారు. కానీ అధికారులు సిద్ధం చేసిన లెక్కలు.. అసలు నిజాలను వెల్లడిస్తున్నాయి.
ఇవీ చదవండి: