Illegal Soil Excavations: పేరుకు సాగు భూముల మెరక.. కానీ చేసేది మాత్రం పక్కా వ్యాపారం. ఈ విషయం పోలవరం కుడి కాలువ గట్టును చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాల్లో మట్టి, గ్రావెల్ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కాలువ గట్లు, పోలవరం కుడి కాలువ మట్టి గుట్టలు, కొండ గుట్టలు.. ఇలా తవ్వకాలకు అడ్డే లేకుండా పోతుంది.
పోలవరం కుడి కాలువ గట్టు నుంచి మట్టి రవాణాకు జలవనరుల శాఖ నుంచి తీసుకున్న అనుమతులకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికీ పొంతన కనిపించడంలేదు. ఈ అక్రమాలపై అధికారులు కన్నెత్తి చూడటంలేదు. వాస్తవానికి పోలవరం గట్టు మట్టిని వ్యవసాయ అవసరాలకు, గ్రామ అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేందుకు మాత్రమే అనుమతులు ఉండగా.. వీటిని అడ్డం పెట్టుకుని మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అందులోనూ పగటి పూట మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉన్నా.. నిబంధనలకు అతిక్రమించి మరీ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు.
ఇటీవల దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. అర్థరాత్రి వేళ అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్న ప్రొక్లెయిన్, తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఇదే విషయమై అటు దెందులూరుతో పాటు ఇటు పెదవేగి అధికారులకు ఆయన సమాచారం అందించారు. మేదినరావుపాలెం, రామారావుగూడెం, ముండూరు గ్రామాల మధ్య ఇష్టారీతిగా గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నట్లు ఆయన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
పోలవరం మండలం ఎఎల్ఎన్డీ పేట సమీపంలోని దానవాయి కొండ పరిసరాల్లోనూ రాత్రివేళ అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొండలాంటి గుట్టలను సైతం.. రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వి తరలించడంతో.. మేదినరావుపాలెం సమీపంలో పోలవరం గట్టు మట్టి కనుమరుగై.. కాలువ మట్టానికి చేరుకుంది.
"దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేస్తూ.. ఒక పక్కన ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. వీళ్లే రియల్ ఎస్టేట్ ఓనర్ల దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని.. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, జిల్లా యంత్రాంగం.. చూస్తూ ఉంది". - చింతమనేని ప్రభాకర్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే
"పోలవరం మట్టి రవాణా జరుగుతోందని అని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అనుమతులు ఉన్నా కూడా రాత్రిపూట తరలించడం నిషిద్ధం కాబట్టి కొన్ని వాహనాలను అదుపులోకి తీసుకున్నాం. కానీ వాళ్లు మేము వెళ్లినప్పుడు తరలించడం లేదు. తవ్వడం లేదు. వీటిపై అధికారులతో చర్చించి.. చర్యలు తీసుకుంటాం". - నాగరాజు, పెదవేగి తహసీల్దార్
అక్రమ తవ్వకాలు కంటికి కనిపిస్తున్నా.. ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఏదో ఒక చోట అక్రమాలను బయటపెడుతున్నా.. ఇటు రెవెన్యూ.. అటు మైనింగ్.. మరోవైపు జలవరుల శాఖ అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోని అధికారులు.. సామాన్యుల ఇళ్ల పునాదులను మట్టితో మెరక చేసుకోవాలంటే మాత్రం సవాలక్ష నిబంధనలు విధిస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.
ఇవీ చదవండి: