రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ హత్యకేసు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మెుత్తం 12 మందిపై కేసు నమోదు చేసి.., ఆరుగురిని అరెస్టు చేసిట్లు ఎస్పీ రాహుల్ దేవ్ స్పష్టం చేశారు. కేసులో బజారయ్య, సురేశ్, మోహన్‌కుమార్, హేమంత్, గంజి నాగార్జున, రెడ్డి సత్యనారాయణలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు బజారయ్య ప్రోద్బలంతోనే హత్య జరిగిందన్నారు.
గంజి ప్రసాద్ హత్య కేసులో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశాం. బజారయ్య ప్రోదల్బంతోనే ముగ్గురు హత్యలో పాల్గొన్నారు. ఏప్రిల్ 26న నిందితుడు సురేష్ కత్తులు సేకరించాడు. ప్రసాద్ హత్యకు ముందు మూడ్రోజులు రెక్కీ నిర్వహించారు. ప్రసాద్ రాకపోకలను గంజి నాగార్జున గమనించాడు. ఏప్రిల్ 27, 28 తేదీల్లో గంజి ప్రసాద్ రాకపోకలు గమనించారు. సురేశ్, హేమంత్ బైకుపై గంజి ప్రసాద్‌ను వెంబడించారు. గంజి ప్రసాద్‌ను చంపాలని గంజి నాగార్జున బాగా రెచ్చగొట్టారు. -రాహుల్ దేవ్, ఏలూరు జిల్లా ఎస్పీ
ఏం జరిగిందంటే ?: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ గత నెల 30న హత్యకు గురయ్యారు. గ్రామంలోని వైకాపాలో రెండు వర్గాలు ఉన్నాయని.. అందులో ఓ వర్గానికి ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం వల్లే.. గంజి ప్రసాద్ హత్య జరిగిందని మరో వర్గం ఆరోపించింది. హత్యకు గురైన వైకాపా నాయకుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లగా.. ప్రత్యర్థి వర్గం వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. కొందరు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి కూడా చేశారు. వెంటనే పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలబడి.. పక్కకు తీసుకెళ్లారు. అయినా.. కొందరు వైకాపా నేతలు, కార్యకర్తలు వెంటపడి మరీ.. ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు.
సంబంధిత కథనాలు