Damaged Eluru to Kaikaluru Roads in AP: ఆ రోడ్డుపై పెద్ద వాహనం వెళ్తుంటే దుమ్ము, ధూళీ లేస్తోంది. ఇక ఈ వాహనాల వెనక వెళ్లే ద్విచక్రవాహనదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏముంది లేచిన ఆ దుమ్ము, ధూళి వారి ముఖాలకు మేకప్‌లా అంటుకుంటుంది. ప్రయాణం అయిపోయాక ఇంటికెళ్లి మేకప్‌ని అదేనండి దుమ్ము, ధూళిని కడుక్కోవడమే. ఇక ఈ గోతులు, కంకర రాళ్లపై ప్రయాణం చేసి హూనమైన ఒళ్లు నొప్పులు తగ్గడానికి మాత్రలు వేసుకోవాల్సిందే.
ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే 22 కిలోమీటర్ల ప్రధాన రహదారిలో సుమారుగా 5 నుంచి 6 కిలోమీటర్లు మాత్రమే సాఫీగా ప్రయాణం సాగుతుంది. మిగిలిన రోడ్డులో ప్రయాణం చేయడమంటే ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లే. నాలుగేళ్లుగా ఈ రహదారి మరమ్మతులను పట్టించుకోకపోవడంతో గజానికో గుంత పడి దారుణంగా తయారైంది. రహదారి మొత్తం కంకర తేలి ఏ మాత్రం ప్రయాణానికి వీలు కాకుండా మారింది.
విడుదల కాని బకాయిలు - నిలిచిపోయిన రోడ్డు పనులు - ప్రజలకు తిప్పలు
ఈ రహదారి దుస్థితిపై వాహనదారులు గగ్గోలు పెట్టడం పలుమార్లు మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు ఎన్.డీ.బీ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. మాదేపల్లి, శ్రీపర్రు కాజ్ వే, మహేశ్వరపురం వద్ద సిమెంట్ రోడ్డు నిర్మించగా శ్రీపర్రు, మహేశ్వరపురం వద్ద ఒకవైపు మాత్రమే రోడ్డు సగం వేసి వదిలేశారు. ఫలితంగా రాత్రి పూట ప్రయాణాలు సాగించే వారు, కొత్త వారు ఈ మార్గంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇటీవల శ్రీపర్రు కాజ్ వే సమీపంలో ఒకవైపు వేసిన రోడ్డుపై ప్రయాణిస్తూ చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. మరోవైపు మండవల్లి మండలం కాకతీయ నగర్ సమీపంలో ఏలూరు నుంచి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గోతుల రోడ్డులో లారీని తప్పించబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొని పక్కనున్న పంట కాల్వలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోడ్డుపై సగటున రోజుకో ప్రమాదం జరుగుతుండటంతో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
గుడివాడ గుంతల రహదారులతో ప్రజల అవస్థలు- పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు
ఏలూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా శివారు నరసాపురం వరకు ఆర్టీసీ బస్సులు మొదలు ఏ వాహనం వెళ్లాలన్నా ఇదే ప్రధాన మార్గం కావడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. దారిపొడవునా ఇరువైపులా చేపలు, రొయ్యల చెరువులు ఉండటంతో నిత్యం లారీలు సైతం ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి.
నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తున్నా, వందలాది వాహనాలు తిరుగుతున్నా ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాకపోవడంపై వాహనదారులు, ప్రజలు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తూతూమంత్రంగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టి వదిలేస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు. వేరే ప్రత్యామ్నాయం లేక ఈ మార్గంలో ప్రయాణాలు చేస్తుంటే వాహనాలు దెబ్బతినడమే కాకుండా వెన్నుపూస సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు.