CPI K. Narayana, Ramakrishna Fire on YSRCP, BJP: మోదీతో భేటీ అనంతరం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై పవన్ కల్యాణ్ మిన్నకుండిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విజయవాడలోని మీడియా సమావేశంలో అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని.. మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకని మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో పొత్తులపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
మోదీ, జగన్ ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ, వైయస్ఆర్సీపీ కలిసే.. పని చేస్తున్నాయన్నారు. బీజేపీ, వైయస్ఆర్సీపీ అరాచకాలను అరికట్టాలంటే.. అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇష్టం ఉన్నా,.. లేకున్నా టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి వెళ్లాలని సూచించారు. దీనివల్ల ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక పరిధిలోని మార్కండేయపురంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పరిశీలించారు. జగనన్న కాలనీని పట్టణానికి దూరంగా నిర్మిస్తు లబ్దిదారులకు సెంటు భూమి , ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల మాత్రమే ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. సామాన్య మానవుడు ఇళ్లు కట్టుకోవడానికి ప్రస్తుత ధరలు అందుబాటులో లేవని రామకృష్ణ అన్నారు.
ప్రభుత్వం లబ్దిదారులకు మూడు సెంట్లు స్థలం రూ.5 లక్షలు ఇవ్వాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏడు సంవత్సరాల క్రితం డిపాజిట్లు కట్టిన టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఈ రోజు వరకూ ఇళ్లు ఇవ్వలేదని.. మూడున్నర సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వకుండా వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందన్నారు. టిడ్కో ఇళ్ల కోసం లబ్ది దారులు ఎదురుచూస్తున్నా పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని.. బంగాళాఖాతంలో వేసి తొక్కినా తప్పులేదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం లబ్దిదారులకు ఇళ్లతో పాటు కాలనీలలో రహదారి, డ్రైనేజీ, విద్యుత్, మంచినీరు, తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లబ్దిదారుల సమస్యలపై వారి నుంచి సంతకాలు సేకరించి డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాలలో వినతి పత్రాలు ఇస్తామని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగా ప్రభాకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం మండల సీపీఐ పార్టీ కార్యదర్శి జే.వి. రమణ రాజు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: