ఒకప్పుడు ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరుపొందిన కొల్లేరులో దాదాపు 12 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. చేపల చెరువుల రూపంలో ఆక్రమణల్లోకి వెళ్లిపోయింది. జిరాయితీ భూములనూ లెక్కిస్తే మొత్తం 15,742 ఎకరాల్లో చేపల చెరువుల ఆక్రమణలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న ఈ సరస్సు అదృశ్యమవుతున్నా స్వార్థం కోసం కొందరు ప్రజాప్రతినిధులు, మరికొందరు దళారులు కలిసి రూ.కోట్ల మేర వ్యాపారం చేస్తున్నారు. సరస్సు స్వరూపం మార్చేసి కాలుష్య కాసారంగా మారుస్తున్నారు. గ్రేట్ పెలికాన్ వంటి 189 రకాల పక్షులు, 61 రకాల ప్రత్యేక మత్స్యజాతులు, 17 రకాల రొయ్యలకు, నీటి సంబంధమైన 17 వృక్షజాలాలకు కొల్లేరు నెలవన్న పేరున్నా ఆక్వాకల్చర్ అదంతా విధ్వంసం చేస్తోంది. 15 రకాల అరుదైన చేపల జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. ఏలూరులో రెండేళ్ల కిందట సంభవించిన వింతవ్యాధికి కొల్లేరు ఆక్వాసాగులో వాడుతున్న విష పదార్థాలే కారణమని జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు నమోదైంది. ఆ నేపథ్యంలోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకే తాజా కొల్లేరు ఆక్రమణల అంశం అధికారికంగా వెలుగుచూసింది.
కొల్లేరు ఆక్రమణలపై 2006లో సుప్రీంకోర్టు సాధికార కమిటీని నియమించింది. ఆ సాధికార కమిటీ కొల్లేరు సరస్సు ఆక్రమణలను స్వయంగా పరిశీలించింది. అప్పట్లో కొల్లేరు సరస్సులో దాదాపు 50వేల ఎకరాల్లో ప్రభుత్వ, జిరాయితీ, డి.ఫాం భూముల్లో చట్టానికి విరుద్ధంగా సాగుతున్న చేపల చెరువులను బాంబులు పెట్టి ధ్వంసం చేశారు. ఆపరేషన్ కొల్లేరు పేరుతో ఆక్రమణలను ధ్వంసం చేసి మళ్లీ కొల్లేరు మంచినీటి సరస్సును పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టారు. +5 కాంటూరులోపు ఉన్న ప్రాంతమంతటినీ కొల్లేరు అభయారణ్యంగా రక్షించాలని జీవో 120 ప్రకారం ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టు దీన్ని ఖరారు చేసింది. ఈ పరిధిలో 83,982.70 ఎకరాల భూమి ఉందని ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ఏ ప్రభుత్వ, ప్రైవేటు, డి.ఫాం భూముల్లో చేపల చెరువులు తవ్వకూడదు. కొల్లేరును సంరక్షించాల్సిన బాధ్యత అటవీశాఖదే అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
15,742 ఎకరాల్లో మళ్లీ చెరువులు : సాక్షాత్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చర్యలు చేపట్టిన తర్వాత కూడా కొల్లేటిని కాపాడలేకపోతున్నారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో 2006 తర్వాత 2022 వరకు 15,742 ఎకరాల్లో మళ్లీ కొత్తగా చేపల చెరువులు తవ్వారని సమాచారం. ఇన్నాళ్లూ ఆక్రమణలు పెరుగుతున్నాయని అనధికారిక అంచనాలే తప్ప అధికారికంగా ఈ స్థాయి ఆక్రమణలు వెలుగు చూడలేదు. తాజాగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో ఉన్న ఒక కేసులో ప్రభుత్వాన్ని వివరణ కోరగా నాటి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్ర కొల్లేరు తాజా పరిస్థితిపై 2021 డిసెంబరులో ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఇటీవల వెలుగుచూసింది. ఆ నివేదికలోనే 2006 కొల్లేరు ఆపరేషన్ తర్వాత మళ్లీ 15,742 ఎకరాలను ఆక్రమించుకుని చెరువులు తవ్వేశారని, అందులో 11,867 ఎకరాలు ప్రభుత్వ భూమి అని కుండబద్దలు కొట్టారు. సుప్రీంకోర్టు ఆక్రమణలను ధ్వంసం చేయించి ఒక రూపు తెచ్చినా తర్వాత రాష్ట్రప్రభుత్వ అధికారులు కొల్లేరును కాపాడే విషయంలో శ్రద్ధ చూపలేకపోతున్నారని తాజా నివేదికలు స్పష్టంగా పేర్కొంటున్నాయి.
ఎమ్మెల్యేల పాత్ర.. అధికారుల కుమ్మక్కు: అక్రమార్కులకు కొల్లేరు కొంగు బంగారంలా తయారయింది. కొల్లేరువాసుల పేరు చెప్పి బయటి వ్యక్తులు వేల రూపాయల లీజుకు చేపల, రొయ్యల చెరువులు సాగు చేస్తూ రూ.కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వేల ఎకరాల సర్కారు భూములను... అదీ ఎంతో విలువైన సరస్సు ప్రాంతాన్ని ఆక్రమించేశారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు. ఎవరు అధికారంలో ఉన్నా కొందరు ఎమ్మెల్యేలు కొల్లేరు కబ్జాలకు వత్తాసు పలుకుతున్నారనేది ఇక్కడి బహిరంగ రహస్యమే. ప్రస్తుతం ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇందులో పాత్ర పోషిస్తున్నారనేది చర్చనీయాంశంగా ఉంది. కొత్త చెరువులను తవ్వించడంలో, అధికారులు జోక్యం చేసుకోకుండా ఒత్తిడి చేయడంలో వారు బాగా ప్రభావం చూపుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంకా కొందరు స్థానికులకు లీజుల సొమ్ము వాటాలుగా పోగా మిగిలింది ఆ ఊళ్ల వాళ్లు పంచుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కొందరు ప్రయోజనాలు పొందుతున్నా కొల్లేరులో తమ పాత్ర లేదని, అంతా అటవీ అధికారుల బాధ్యతే అని పేర్కొంటున్నారు. అటవీశాఖ అధికారులు నామమాత్రపు కేసులు పెడుతున్నారు తప్ప... ఆక్రమణలను పూర్తిగా తొలగించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చెరువు గట్టును కొద్దిగా ధ్వంసం చేయడం, వాహనాలు సీజ్ చేసి కేసు పెట్టడానికే అటవీశాఖ పరిమితమవుతోంది. తర్వాత నెమ్మదిగా ఆ గట్లు పూడ్చుకుని యథేచ్ఛగా చెరువులు సాగు చేసుకుంటున్నా ఎవరూ ఏమీ చేయని పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: Kolleru Lake : కొల్లేరును మళ్లీ కొల్లగొట్టేస్తున్నారు!