జర్నలిస్టులపై ముఖ్యమంత్రి జగన్ అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై కేసులు పెట్టే అధికారం జీవో 938 ద్వారా ఒకరికే ఇస్తే... జీవో 2430 ద్వారా ఆ అధికారాన్ని 10మందికి పంచామని దేవులపల్లి అమర్ చెప్పడం అతి దారుణమన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగస్ఫూర్తికే వ్యతిరేకమన్నారు. ఏపీలో జీవో గురించి తెలంగాణకు చెందిన అమర్ మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వేరే రాష్ట్రానికి చెందినవాడు ఈ రాష్ట్రంలో ఉద్యోగం తీసుకోవడమే తప్పని... సీఎం జగన్ తప్పుడు జీవోలకు వంతపాడటం మరీ తప్పు అని ఆయన దుయ్యబట్టారు. అమర్ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ జీవోను సమర్థిస్తున్నారని యనమల మండిపడ్డారు. అమర్ వ్యాఖ్యలు చూస్తుంటే అసలు జర్నలిజాన్నే వదిలేశారా అనిపిస్తోందన్నారు. తండ్రి ఇచ్చిన 938 జీవో కన్నా... కొడుకు ఇచ్చిన జీవో 2430 మరింత ప్రమాదకరమన్నారు. మీడియాకు లక్ష్మణరేఖ ఉండాలని, లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అమర్ పేర్కొనడం ద్వంద్వ విధానమన్నారు.
ఓ రెండు ప్రముఖ పత్రికలను అడ్డుకునేందుకే ఈ జీవో తెచ్చామని మంత్రి పేర్ని నాని చెప్పడం.. కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. వ్యక్తులపై కక్షతో పత్రికల గొంతు నులమడం కన్నా పాసిజం ఏముందన్నారు. జగన్ ఇప్పటికైనా నిరంకుశ పోకడలకు స్వస్తి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :