రాజమహేంద్రవరంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ భూములను పేదలకు ఇళ్ల స్థలాల పంపణీ కోసం ప్రతిపాదించడంపై మాజీఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. జీవో నంబర్ 510, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 75 ప్రకారం విద్యాసంస్థల భూములను ఇళ్ల స్థలాల కోసం వినియోగించకూడదని స్పష్టంగా ఉన్నట్టు వివరించారు. 1985లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీకి ఇరు రాష్ట్రాల్లో 5 పీఠాలు ఉన్నాయని... వాటిని ఇంకా విభజించలేదని లేఖలో పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో రాజమహేంద్రవరంలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆధీనంలో ఉన్న 20 ఎకరాల భూములను వినియోగించుకునేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేయడం సరికాదని హితవు పలికారు. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి వివరాలు కేంద్ర 10వ షెడ్యూల్‌లో పొందుపర్చారని... దీనిపై కలెక్టర్ అవగాహన లేకుండా వ్యవహరించడం తగదని పేర్కొన్నారు.