తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని పురాతన ఆర్సీఎం చర్చి గేటు వద్ద ఉన్న మేరీమాత, ఏసుక్రీస్తు విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనపై ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహనరావు, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్ పరిశీలించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. మంగళవారం అర్ధరాత్రి ఘటన జరిగిన నేపథ్యంలో బుధవారం వీరు మండపేటలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. రెండు సుత్తులతో దుండగులు విగ్రహాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు సుత్తులను అక్కడే వదిలేయడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి వచ్చిన పోలీసు జాగిలాలు వాసన అనుసరించి కరాచీ సెంటరు వరకు వచ్చి ఆగిపోయాయి. చర్చి వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో సమీపంలోని సీసీ ఫుటేజీలు పరిశీలించాలని డీఐజీ ఆదేశించారు. పట్టణంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. స్పెషల్ బ్రాంచి డీఎస్పీ మురళీమోహన్, రామచంద్రపురం ట్రైనీ డీఎస్పీ బాలచంద్రారెడ్డి, మండపేట సీఐ నాగమురళి, రూరల్ సీఐ మంగాదేవీ దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో సెక్షన్ 30 యాక్టు అమల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాస్టర్ రత్నాకర్ మాట్లాడుతూ, తమకు ఎవరిపైనా అనుమానం లేదనీ.. ఎటువంటి ఆందోళన చేపట్టమనీ.. ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: