రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అరాచక పాలన కొనసాగుతోందని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం మండపంలో మూడు రోజుల క్రితం హత్యకు గురైన తెదేపా కార్యకర్త వూటుకూరి వీరబాబు కుటుంబాన్ని కాకినాడ తెదేపా పార్లమెంట్ నేతలతో కలిసి చినరాజప్ప పరామర్శించారు. నాయకులను చూసి మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి వరుపుల రాజా భరోసా ఇచ్చారు. ఘటనపై న్యాయపోరాటం చేస్తామన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు పిల్లి అనంత లక్ష్మీ, పిల్లి సత్యనారాయణ, కాకినాడ మేయర్ సుంకర పావని ఇందులో పాల్గొన్నారు.
మరోవైపు గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో ఇటీవల అరెస్టయిన 11 మంది తెదేపా కార్యకర్తల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరామర్శించారు. వైఎస్సార్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించినందుకు తెదేపా కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని ఆయన మండిపడ్డారు. దేశంలో బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంటే.... రాష్ట్రంలో మాత్రం పులివెందుల రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. వైకాపా నాయకుల ఒత్తిళ్లతో తమ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని ఆంజనేయులు హెచ్చరించారు.
ఇదీ చదవండి
ఏలూరు పరిధిలో 'ఆరోగ్య అత్యవసర పరిస్థితి' ప్రకటించండి: చంద్రబాబు