TDP Leaders Protest For To Repair Roads in Gokavaram : ప్రధాన రహదారులపై పడిన పెద్ద పెద్ద గుంతలతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని, కొత్త రోడ్లు నిర్మించడం పక్కన పెడితే, కనీసం గుంతలు పూడ్చలేని దుస్థితిలో వైఎస్సార్సీపీ పాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా గోకవరం నుంచి జగ్గంపేట వెళ్లే దారిలో సూదికొండ, జగన్నాథపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడి కనీసం వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం నెహ్రూ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం అక్కడకు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు.
TDP Leaders Fire on CM Jagan For Roads Situation in AP : ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పెద్దాపురం నుంచి గోకవరం వరకు రెండు బిట్లుగా రోడ్డు నిర్మాణానికి 14 కోట్ల రూపాయలతో టీడీపీ హయాంలోని ప్యాకేజీ నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ పనులు పూర్తి చేయలేకపోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. హడావుడిగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను నరికి సొమ్ములు చేసుకున్నారే తప్ప.. రోడ్డు విస్తరణ పనులు మాత్రం చేపట్టలేదని అన్నారు. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని నెహ్రూ మండిపడ్డారు.
YSRCP Bus Yatra in AP : సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడితే వై నాట్ 175 (Why Not 175) అనే ముందు ఈ రోడ్ల పరిస్థితి దృష్టిలో పెట్టుకోవాలని జ్యోతుల నెహ్రూ హితువు పలికారు. ఇప్పటి వరకు హెలికాప్టర్లలో తిరగడం వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనిపించలేదని అన్నారు. త్వరలో సీఎం జగన్ బస్సు యాత్ర (CM Jagan Bus Yatra) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కాబట్టి రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చిన తర్వాత జగన్ ఈ బస్సు యాత్రలు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ రోడ్డుపై పడిన గుంతలు పూడ్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్వీఎస్ అప్పల రాజు, అడపా భరత్ బాబు, మంగరౌతు రామకృష్ణ, భద్రం, కన్నబాబు, పాలూరి బోసు బాబు, ఉంగరాల రాము, ఉంగరాల గణేష్, పోసిన ప్రసాద్, మండిగ గంగాధర్, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.
"రోడ్డు నిర్మాణానికి మా ప్రభుత్వంలో 14 కోట్ల రూపాయలతో ప్యాకేజీ నిధులు కేటాయించాం. ఇప్పటికీ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. వై నాట్ అనే ముందు రోడ్లు బాగు చేయండి. సీఎం జగన్ బస్సు యాత్రలు చేసేముందు రహదారులు మరమ్మతులు చేయించండి"- జ్యోతుల నెహ్రూ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు