తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో తెదేపా చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పెంచిన ఆస్తి పన్ను రద్దు చేయాలి, సురక్షిత తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెదేపా నిరసన ర్యాలీ చేపట్టింది. తెదేపా కార్యాలయం నుంచి పురపాలక సంఘం కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ కమిషనర్ రామ్మోహన్‌కు వినతిపత్రం సమర్పించేందుకు ముందే అనుమతి తీసుకున్నారు. అయితే తాము వచ్చే సమయానికి కమిషనర్ వెళ్లి పోయారంటూ తెదేపా నాయకులు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
తెదేపా నాయకులను పోలీసులు అక్కడినుంచి పంపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, తెదేపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ బైఠాయించి నిరసన కొనసాగించారు. పోలీసులు వర్మను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తుండగా.. వాహనానికి తెదేపా శ్రేణులు అడ్డుపడి ప్రతిఘటించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇవీ చూడండి...