తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో పేదల ఇళ్ల స్థలాలకోసం సేకరిస్తున్న ఆవ భూములను తెలుగుదేశం బృందం పరిశీలించింది. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలతో పాటు రాజానగరం నియోజకవర్గానికి చెందిన వారికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రైతుల నుంచి సుమారు 573 ఎకరాలను కొనుగోలు చేస్తోంది.
ఏడాదిలో సుమారు ఆరేడు నెలలు ముంపులోనే ఉండే ఈ భూములను పేదల ఇళ్ల పట్టాలుగా ఎలా ఇస్తారని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. ఎకరం ఐదారు లక్షలు విలువచేసే భూములను 40 నుంచి 45 లక్షలకు కొనుగోలు చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
బురదకాల్వ, జెల్ల కాల్వతో పాటు గోదావరి బ్యాక్ వాటర్‌తో ఈ ప్రాంతం ఎప్పుడూ ముంపులోనే ఉంటుందని, ఇలాంటి భూములు ఆవాసానికి ఏమాత్రం పనికిరావని అన్నారు. బూరుగుపూడి నుంచి పొలాలను పరిశీలించేందుకు బయలుదేరిన తెలుగుదేశం నాయకులని తొలుత పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా నాయకులు ఆగకుండా స్థలాలని పరిశీలించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పతో పాటు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి అయ్యనపాత్రుడుతో మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు ఆవ భూములని పరిశీలించారు. న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా తక్షణం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష నాయకులు తెలుగుదేశం నేతలకు వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి: తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు