పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని తెదేపా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం తూర్పుగోదావరి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. జగ్గంపేట ఇన్‌ఛార్జి జ్యోతుల నెహ్రూ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శనివారం జగ్గంపేటకు చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎస్.వి.ఎస్.అప్పలరాజు తెదేపా రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కిర్లంపూడి మండలంలో తెదేపా మద్దతుతో గెలిచిన భూపాలపట్నం, ముక్కొల్లు, రామకృష్ణాపురం సర్పంచులు వీరంరెడ్డి కాశిబాబు, జ్యోతుల రాంబాబు, కంఠా సరస్వతి తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ముక్కొల్లు మండలంలోని పలువురు నాయకులు వారిని అనుసరించారు. పి.గన్నవరం, మామిడికుదురు, కోరుకొండ, గోకవరం మండలాల తెదేపా నాయకులు పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
చంద్రబాబు నిర్ణయం తప్పు: రెడ్డి సుబ్రహ్మణ్యం
పరిషత్ ఎన్నికలను తెదేపా బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు తప్పు అని శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘స్థానిక సంస్థల ద్వారా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన నేను... చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదించలేను. ఏ పార్టీ అయినా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా పార్టీ అధ్యక్షుడు మాట్లాడకూడదని అలా చంద్రబాబు నాయుడు మాట్లాడారన్నారు. అది అది ఆయన వ్యక్తిగత నిర్ణయం అన్నారు. ఈ నిర్ణయాన్ని నేను ఆమోదించడం లేదన్నారు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. అంతిమంగా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా’ అని అన్నారు.
పోటీలో ఉంటాం..డీఏఎన్ రాజు
స్థానిక కార్యకర్తలు, నాయకుల కోరిక మేరకు పరిషత్ ఎన్నికల్లో పోటీలో కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నట్లు విశాఖ జిల్లా భీమిలి మండల తెదేపా అధ్యక్షుడు, జడ్పీటీసీ అభ్యర్థి డీఏఎన్ రాజు ప్రకటించారు. శనివారం అన్నవరంలో జరిగిన తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధినేత చంద్రబాబునాయుడు, పొలిట్‌బ్యూరో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలో తొమ్మిదికి అయిదు స్థానాలను గెలిచిన ఉత్సాహంతో భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో మెజారిటీ స్థానాలను సాధిస్తామన్నారు.
- ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తామని పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో తెదేపా నాయకులు పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం కైకరంలో జరిగిన సమావేశంలో.. బరిలో నిలిచి, విజయం సాధించాలని నిర్ణయించారు. ఆకివీడులో తెదేపా నాయకులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల సమావేశమై పోటీలో కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారు. గోపాలపురంలో 16 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు స్థానిక నాయకులు ప్రకటించారు.
- అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు నిర్ణయం స్వాగతిస్తూనే తాను.. కల్యాణదుర్గం జెడ్పీటీసీ అభ్యర్థి విజయానికి ఎంపీపీ అయ్యేందుకు.. ఎంపీటీసీల విజయం సాధించేందుకు ప్రచారం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని జనార్దన్‌కు కూడా వివరించానని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
ఇదీ చూడండి. ఇది నవతరం... చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తాం: పవన్ కల్యాణ్