TDP leaders met Nara Bhuvaneshwari: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు నేటి నుంచి 2 రోజుల కస్టడీకి అనుమతించడంతో సీఐడీ బృందం చంద్రబాబు నాయుడిని విచారిస్తోంది. ఇప్పటికే... చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ నేతలే కాకుండా వివిధ రాజకీయ పార్టీలు సైతం చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ మెుదలు.. భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ, రామకృష్ణలతో పాటుగా పలువురు కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజమహేంద్రవరంలో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును పరామర్శించేందుకు రాజమహేంద్రవరం జైలుకు వస్తున్న పలు పార్టీల నేతలు.. చంద్రబాబు కుటుంబ సభ్యులను కలుస్తున్నారు. తాజాగా పలువురు టీడీపీ నేతలు భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి పరామర్శించారు.
తాజాగా రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, బ్రాహ్మణిని పరిటాల సునీత, ధూళిపాళ్ల నరేంద్ర మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ కలిశారు. తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పరిటాల సునీత పేర్కొన్నారు. ఎలాంటి తప్పు చేయని చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోని చంద్రబాబు మచ్చలేని నాయకుడిలా భయటకు వస్తారని తెలిపారు. అరెస్ట్‌కు వ్యతిరేకంగా... పట్టణాలు, గ్రామాల్లో సైతం చంద్రబాబుకు మద్ధతు వస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబుు బస్సు యాత్ర, లోకేశ్ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో మద్దతు వస్తుందనే... ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెతికి అందినకాడికి దోచుకుంటున్నారని పరిటాల సునీత ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైసీపీ అక్రమాలపై కేసులు పెడితే... రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని పరిటాల సునీత ఎద్దేవా చేశారు.
చంద్రబాబుపై కావాలనే కేసులు పెడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 11 కేసుల్లో నింధితుడైన వ్యక్తి... సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్న వక్తి చెబితే... అధికారులు తమ నేతపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో న్యాయం గెలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడేవాళ్ల మీద అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. శాసన సభలో మంత్రులు అసత్యాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఐఐటీ, నిట్... లాంటి అనేక సంస్థలతో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజల ముందు వాస్తవాలను ఉంచకుండా... అసత్యాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే భవాని చంద్రబాబు కుటుంబాన్ని కలిశారు.. ఆయన ఫ్యామిలీ చాలా ధైర్యంగా ఉందని తెలిపారు. చంద్రబాబుకు వచ్చే ఆధరణ చూసి ఓర్వలేని పరిస్థితుల్లో చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ చేసినా... కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసికట్టుగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా భయటికి వస్తారని పేర్కొన్నారు.