అక్రమ మైనింగ్ కోసం గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలపై వైకాపా ప్రభుత్వం దాడి చేస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. ఆదివాసీల జీవనశైలిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానాలపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన సంపదను దోపిడీ చేస్తూ.. గిరిజనుల ఆదాయానికి గండికొట్టిన విధానాన్ని కమిషన్‌కు వివరిస్తామన్నారు. స్థానిక అవసరాల కోసం చిన్న బాట వేస్తున్నామని నమ్మించి జాతీయ రహదారి తరహాలో రోడ్డు ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
ఉపాధి హామీ నిధులతో రూ.70లక్షలు ఖర్చు పెట్టిన ఈ రహదారి నిర్మాణంలో గిరిజనులు పాల్గొనలేదని అన్నారు. కడప నుంచి వచ్చిన యంత్రాల సాయంతోనే రహదారి నిర్మాణం జరిగిందని ఆమె ఆరోపించారు. రహదారి ఏర్పాటును సమర్థించుకుంటున్న అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఇదే తరహాలో రోడ్ల నిర్మాణంపై ఎందుకు శ్రద్ధ చూపట్లేదని నిలదీశారు. విలువైన ఖనిజ సంపద దోపిడీకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఆర్థిక మూలాలు దెబ్బతీసే చర్యలను ఖచ్చితంగా ప్రతిఘటించి తీరుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
Jindal Steel and Power: జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు 860 ఎకరాల భూముల కేటాయింపు