Chandrababu three days padayatra details: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 'ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి మూడు రోజులపాటు (15, 16, 17) కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు ఆయన.. మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రోడ్‌షోల్లో, బహిరంగ సభల్లో పాల్గొని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ వర్గాలు వెల్లడించాయి
చంద్రబాబు పర్యటన వివరాలు: తొలిరోజు జగ్గంపేట, రెండవ రోజు జగ్గంపేట, పెద్దాపురం.. మూడవ రోజు పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. మూడు రోజులు.. 145 కి.మీ పొడవున రోడ్‌షో, పర్యటన సాగనుంది. జగ్గంపేటలో పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పూర్తి చేశారు. ఇక గోకవరంలో పర్యటన ఏర్పాట్లను నెహ్రూ, వంతల రాజేశ్వరి తదితరులు పూర్తి చేశారు.
తొలి రోజు పర్యటన ఇలా సాగనుంది: చంద్రబాబు నాయుడు తొలి రోజు పర్యటనను.. జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. పర్యటనను ప్రారంభించనున్నారు. సాయంత్రం జగ్గంపేటలో బస్ స్టాండ్ సమీపంలో రోడ్ షో నిర్వహించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి.. రాత్రికి జగ్గంపేట జ్యోతుల నెహ్రు కాంప్ కార్యాలయంలో బస చేయనున్నారు.
రెండవ రోజు పర్యటన: రేపు ఉదయం చంద్రబాబు నాయుడు జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత 2.30 గంటలకు పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం వెళ్తారు. 3 గంటలకు ద్విచక్ర వాహన ర్యాలీగా సాగి కట్టమూరు కూడలికి వస్తారు. కాసేపు విశ్రాంతి తర్వాత 4.30 గంటలకు పెద్దాపురంలో దర్గా సెంటర్ నుంచి వెంకటేశ్వర ఆలయం వరకు రోడ్‌షోగా సాగుతారు. 5.30 గంటలకు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 7.30 గంటలకు సామర్లకోటలో రోడ్‌షోలో పాల్గొని.. రాత్రికి సామర్లకోట చక్కెర కర్మాగారం అతిథి గృహంలో బస చేస్తారు.
మూడవ రోజు పర్యటన: చంద్రబాబు సమక్షంలో మహాసేన అధ్యక్షుడు రాజేష్ టీడీపీలో చేరతారు. ఉదయం 10-11 గంటల మధ్య ఎస్సీలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తూర్పు గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో సమన్వయ కమిటీలతో సమీక్ష చేస్తారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత 2.30 గంటలకు హుస్సేన్‌పురం మీదుగా వేట్లపాలెం వెళ్తారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు విగ్రహం వద్ద నివాళి అర్పించి.. మేడపాడు, పెద్ద బ్రహ్మదేవం, బిక్కవోలు మండలం ఇల్లపల్లి, బిక్కవోలు, ఆర్‌ఎస్‌పేట, బలభద్రపురం, లక్ష్మీనర్సాపురం మీదుగా అనపర్తిలో దేవీచౌక్‌కు రోడ్డుషో చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు అనపర్తి రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహానికి నివాళి అర్పిస్తారు. ఆపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి మూలారెడ్డి కుటుంబికులను చంద్రబాబు పరామర్శిస్తారు. 7.45 గంటలకు బయలుదేరి మధురపూడి విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం అవుతారు అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవీ చదవండి