తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని తూర్పు గానుగూడెంలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
దాడులకు తెగబడ్డారు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు గెలిచిన గ్రామాల్లో వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గానుగూడెం గ్రామంలో జనసేన నేత గళ్ల రంగా సహా పార్టీ కార్యకర్తలపైనా వైకాపా దాడులకు తెగబడిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు విజయం సాధించారనే అక్కసుతో దౌర్జ్యన్యానికి దిగారని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యం అపహస్యం..
తూర్పు గానుగూడెంలో చోటు చేసుకున్న దాడులు, తదనంతర పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని మనోహర్ పేర్కొన్నారు. ఈ ఘటనను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టికి జిల్లా నేతలు తీసుకెళ్లగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని అధినేత సూచించినట్లు వెల్లడించారు.
ఇప్పటికీ చర్యల్లేవ్..
ఈ దాడుల వెనక వైకాపా నేతల ప్రమేయం ఉందని.. గ్రామమంతా వైకాపా పేరే చెబుతున్నా పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏం పద్దతని నిలదీశారు. గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన గళ్లా సత్యశ్రీ, ఆమె భర్త రంగా, జనసేన శ్రేణులపైనా ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి అధికార పార్టీ శ్రేణులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : పైథాన్-5 మిసైల్ ప్రయోగం విజయవంతం