Cotton Barrage: దాదాపు 200 ఏళ్ల క్రితం గోదావరి తీరంలో ప్రజలు అతివృష్టి, అనావృష్టితో అల్లాడిపోయేవారు. తుపాన్లు, వరదలతో పంటలు తీవ్రంగా నష్టపోయేవారు. కొన్నిసార్లు వర్షాలు లేక క్షామంతో పొలాలు ఎడారుల్ని తలపించేవి. గోదావరి ప్రాంతాన్ని ఈ దుస్థితి నుంచి బయట పడేయాలని ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం ఇంజినీర్ ఆర్థర్ కాటన్ భావించారు. రోజూ 15 మైళ్ల దూరం గుర్రంపై ప్రయాణించి సర్వే చేశారు. సాంకేతిక పెద్దగా అందుబాటులో లేని ఆ రోజుల్ల్లో కాటన్ ఎంతో శ్రమించి గోదావరి లోతు, నీటి వేగాన్ని అంచనా వేసి.. మద్రాస్ గవర్నర్కు ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించారు. బ్రిటీష్ ప్రభుత్వం 1846 డిసెంబరు 25న ఆనకట్ట నిర్మాణానికి ఆమోదించింది. తర్వాత ఏడాది ఆనకట్ట నిర్మాణానికి ధవళేశ్వరం వద్ద కాటన్ శ్రీకారం చుట్టారు.
యంత్రాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని ఆ రోజుల్లో.. కాటన్ దొర కేవలం ఐదేళ్లలోనే ఆనకట్ట నిర్మాణం పూర్తి చేశారు. అప్పట్లో 4 లక్షల 75 వేల 572 రూపాయల వ్యయంతో ఆనకట్ట నిర్మించారు. పంట కాల్వల అభివృద్ధికి మరో 14 వేల రూపాయలు కేటాయించారు. ఆనకట్ట కట్టిన దాదాపు 125 ఏళ్ల తర్వాత.. ఆనాటి బ్రిటీష్ నిర్మాణం బలహీన పడటంతో ఆధునిక పద్దతులతో కొత్త బ్యారేజీని 1970 ప్రారంభించి 1982లో కట్టారు. 175 గేట్ల ద్వారా పదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ వాసులకు తాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందిస్తున్నారు. ఈ అపురూప సాగు నీటి ప్రాజెక్ట్ ను తాజాగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) సదస్సు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు రావడంపై జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: