దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పొట్టి జాతి ఆవులను పెంచుతూ ప్రత్యేకతను చాటుతున్నారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన నాడీపతి వైద్యుడు కృష్ణంరాజు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి సమీపంలోని గోశాలలో వీటిని పెంచుతున్నారు. 8 అంగుళాల నుంచి 36 అంగుళాల ఎత్తు వరకు ఇక్కడ పుంగనూరు జాతి గోవులూ ఇక్కడ దర్శనమిస్తున్నాయి.
ప్రపంచ రికార్డులు కైవసం
కృష్ణంరాజు... 10 ఏళ్ల క్రితం ఓ పుంగనూరు ఆవును కొన్నారు. దానికి గుంటూరు లాం ఫాం నుంచి కృత్రిమ గర్భధారణ చేయించారు. 9 అంగుళాల పొట్టి కోడె దూడ పుట్టింది. అది అప్పట్లో ప్రంపంచ రికార్డు. ఆ తర్వాత పశ్చిమ బంగ నుంచి పొట్టి జాతి ఎద్దును తీసుకు వచ్చారు. ఈ జంటకు కూడా పుట్టిన మరగుజ్జు దూడలకు ప్రపంచ రికార్డు వచ్చింది. ఆపై పుంగనూరు పశువుల్ని కొనుగోలు చేయటంతోపాటు గర్భధారణ చేయించి వాటిని వృద్ధి చేశారు. ఇప్పటి వరకు వీటిని కాకినాడలో సంరక్షించారు. ఆరు నెలల క్రితమే లింగంపర్తి సమీపంలోని కొండల వద్ద ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గోశాలకు తరలించారు. దీనికి 'నాడీపతి గోశాల' అని పేరు పెట్టారు. ఇక్కడ అతి చిన్న పుంగనూరు(మీనేచర్) 25, సాధారణ పుంగనూరు 60 గోవులు ఉన్నాయి.
ఆవుతో ఆలింగనం
భారతీయ జీవన విధానంలో గోవుకున్న ప్రాధాన్యం ఎనలేనిది. దీనిలో భాగంగానే ప్రాచీన వైద్య విధానమైన 'ఆవుతో ఆలింగనం' ప్రక్రియను నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు కృష్ణంరాజు. గత నెల 16న చేపట్టిన ఆవు ఆత్మీయ ఆలింగనం కార్యక్రమంలో 216 మంది గో ప్రేమికులు పాల్గొన్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఈ కార్యక్రమం నమోదైంది. ఆవుని కనీసం 10 నిమిషాలు ఆలింగనం చేసుకుంటే మెదడులోని గ్రంధులు, హార్మోన్లు ఉత్తేజితమవుతాయని... దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తొలగి మనసుకు ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు ఈ గో ప్రేమికుడు.
మంచి డిమాండ్
సాధారణ పెద్ద ఆవుని పోషించే బదులు పుంగనూరు గోవుల్ని 10ని పెంచవచ్చు. ఇవి తినే గడ్డి, దాణా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కానీ వీటి ధర మాత్రం 3 నుంచి 15 లక్షల రూపాయల వరకు కూడా ఉంటుంది. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువ. మన దేశంలోని ఒంగోలు జాతిసహా వివిధ పశువుల్ని విదేశీయులు అభివృద్ధి చేసుకున్నారు. పుంగనూరు మాత్రం వారి వద్ద లేవనే చెప్పాలి.
ఇదీ చదవండి
'బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం లేదు... కోడి మాంసం, గుడ్లు తినొచ్చు'