విజయవాడ గవర్నర్‌పేట-1 డిపోలోని గ్యారేజీలో శ్రామిక్‌గా పని చేస్తున్న వ్యక్తి ఉద్యోగినిని వేధింపులకు గురి చేస్తున్నాడన్న అరోపణలతో ఆరెస్టు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇదే డిపోలో తాగిన మైకంలో సూపర్‌వైజర్‌తో ఆ వ్యక్తి గొడవపడ్డాడు. దీంతోపాటు విధులకు గైర్హాజరు అవుతుండడంతో క్రమశిక్షణ చర్యల కింద అతడిని విధుల నుంచి తొలగించారు. ఉన్నతాధికారులకు మొర పెట్టుకోవడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయినా ప్రవర్తనలో మార్పురాలేదు. తనను ప్రేమించాలంటూ అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగి వెంటపడ్డాడు. దీనిపై ఆమె పలుసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఫోన్లలోనూ అదేపనిగా ఇబ్బంది పెట్టేవాడు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి, వేధింపులు ఎక్కువ చేశాడు. ఈనెల 9, 10 తేదీల్లో మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగాడు. తననే పెళ్లి చేసుకోవాలని, లేనిపక్షంలో చంపి, తాను కూడా ప్రాణం తీసుకుంటానని హెచ్చరించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సత్యనారాయణపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు.
అంతర్గత విచారణ
ఈ ఘటనకు సంబంధించి ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా విచారించారు. అనంతరం శాఖాపరమైన విచారణకు ఆటోనగర్ డిపో ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్‌ను నియమించారు. విచారణలో గుర్తించిన అంశాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఇందులో అజయ్ ఆర్టీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు కేసులో అరెస్టు అయి, 48 గంటలు పైగా రిమాండ్‌లో ఉండడం, తాగిన మైకంలో పైఉద్యోగి ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించడం, తదితర అభియోగాలు నిరూపితం అయ్యాయని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు.
ఐదు నెలలు.. నలుగురిపై చర్యలు
ఇటీవలి కాలంలో కృష్ణా రీజియన్‌లో పలువురు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురికావడం చర్చనీయాంశంగా మారింది. గత ఐదు నెలల్లోనే నలుగురు సస్పెండ్ కాగా, ఒకరిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించారు.
గన్నవరం డిపోలో పనిచేస్తున్న సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వీరభద్రరావు.. మహిళా కండక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అభియోగాలపై సస్పెండ్ అయ్యారు.
ఇదీ చదవండి: ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు... నోటిఫికేషన్ విడుదల...