తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీపై రహదారి ఛిద్రమైంది. బ్యారేజీ ప్రారంభం నుంచి చివరి వరకు రోడ్డు ధ్వంసమైంది. గత నెల వరకు కురిసిన వర్షాలతో సమస్య మరింత జఠిలమైంది. గతంలో సిమెంట్ రోడ్డుపై తారు, చిప్స్‌తో వేసిన పొర దాదాపుగా కొట్టుకుపోయింది. దీనివల్ల బ్యారేజీపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
గోతులతో ప్రమాదాలు
కాటన్ ఆనకట్టపై ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వరం నాలుగు ఆర్మ్‌లు ఉంటాయి. మధ్యలో అనుసంధాన రహదారి ఉంటుంది. ధవళేశ్వరం, ర్యాలీ ఆర్మ్లపై తారురోడ్డు పూర్తిగా కోతకు గురైంది. మద్దూరు, విజ్జేశ్వరం ఆర్మ్ ల గుంతల్లో గతంలో వేసిన అతుకులు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల ఇనుప ఊచలు బయటపడ్డాయి. కాటన్ బ్యారేజీపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఆనకట్ట అనుసంధాన రహదారి కూడా అక్కడక్కడ గుంతలు పడ్డాయి. రాత్రివేళ ఈ గోతుల్లో పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
అసలే గోతులు... పైగా చీకటి
కాటన్ బ్యారేజీపై భారీ వాహనాల రాకపోకలు సాగించేందుకు అనుమతి లేదు. కానీ ఇవన్నీ ధవళేశ్వరం, విజ్జేశ్వరంతోపాటు మధ్యలో ఆత్రేయపురం మండలం వైపు నుంచి కూడా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇక విద్యుత్ దీపాలు అరకొరగా వెలుగుతున్నాయి. మద్దూరు ఆర్మ్‌పై ఒక్క దీపం కూడా వెలగటం లేదు. దీనివల్ల రాత్రివేళ ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. కాటన్ ఆనకట్టతోపాటు తూర్పు గోదావరి జిల్లాలో మిగతా రోడ్లు, వంతెనల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస మరమ్మతులు కూడా చేయకపోవటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి