రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ..తూర్పుగోదావరి జిల్లా అయినాపురంలో నిన్న ఆత్మహత్యకు యత్నించిన విశ్రాంత ఉద్యోగి కృష్ణమూర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు అయినాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట మృతదేహంతో నిరసన తెలిపారు. కృష్ణమూర్తి ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
మమ్మిడివరం మండలంలోని అయినాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సహాయకుడిగా ఉద్యోగ విరమణ చేసిన రాయపురెడ్డి కృష్ణమూర్తి సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణమూర్తి గతేడాది డిసెంబరులో ఉద్యోగ విరమణ చేయగా..ఆర్థిక ప్రయోజనాలు అందలేదు. అందుకు సహకార సంఘం అధికారులు పట్టించుకోకపోవటమే కారణమని భావిస్తూ మనస్తాపం చెందారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఏటీఎం కార్డుతో కృష్ణమూర్తి సొమ్ములు కాజేయటంతో పాటు, పదవీవిరమణ ప్రయోజనాలు నిలిపివేయటంతో ఆత్మహత్యకు యత్నించాడు. అస్వస్థతకు గురైన అతణ్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
డీజీపీకి అచ్చెన్న లేఖ..
వైకాపా నేతల వేధింపులు తాళలేక విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. నిబద్దత కలిగిన పోలీసుగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సామాన్యుల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందని అచ్చెన్న ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదురిస్తే బెదిరింపులు, ఆస్తుల ధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : అతని ఆత్మహత్యాయత్నానికి వైకాపా నేతలే కారణం.. తక్షణమే చర్యలు తీసుకోండి.. డీజీపీకి అచ్చెన్న లేఖ