Todays Temperatures: వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ధవళేశ్వరంలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలకు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు:
- ధవళేశ్వరం 46.8 డిగ్రీలు
- ప్రకాశం జిల్లా గుండ్లపల్లి 46.7 డిగ్రీలు
- శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5 డిగ్రీలు
- బాపట్ల జిల్లా అమృతలూరులో 46.4 డిగ్రీలు
- కోనసీమ జిల్లా మండపేటలో 46.3 డిగ్రీలు
- గుంటూరు జిల్లా తాడికొండలో 46.3 డిగ్రీలు
- కాకినాడ జిల్లా సీతంపేటలో 46.2 డిగ్రీలు
- కృష్ణా జిల్లా కోడూరులో 46.2 డిగ్రీలు
- ఏలూరు జిల్లా ఏదులగూడెంలో 46 డిగ్రీలు
- ఎన్టీఆర్ జిల్లా పుట్రేలలో 45.9 డిగ్రీలు
- నెల్లూరు జిల్లా పెద్దారెడ్డిపల్లెలో 45.9 డిగ్రీలు
- పల్నాడు జిల్లా విజయపురిలో 45.8 డిగ్రీలు
- పార్వతీపురం జిల్లా కురుపాంలో 45.4 డిగ్రీలు
- తిరుపతి జిల్లా సత్యవేడులో 45.4 డిగ్రీలు
- నంద్యాల జిల్లా పాములపాడులో 45.2 డిగ్రీలు
- విజయనగరం జిల్లా గొల్లపాడులో 45.1 డిగ్రీలు
- ప.గో. జిల్లా తణుకులో 45.1 డిగ్రీలు
- అల్లూరి జిల్లా నువ్వుమామిడిలో 45 డిగ్రీలు
- అనకాపల్లి జిల్లా మాడుగులలో 45 డిగ్రీలు
నిర్మానుష్యంగా రోడ్లు: విజయవాడలో ఎండలు మండుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండకు భయపడి అత్యవసర పనులకు మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. ఇంటి వద్దనున్న వారి సైతం ఎండ తీవ్రత, వేడి గాలులకు అవస్థలు పడుతున్నారు. ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. ఉష్ణోగ్రతలు ఒక్కోరోజు ఒక్కో స్థాయిలో నమోదవుతున్నాయి. నగరంలో గత రెండు రోజులుగా సుమారు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోడ్లకి ఇరవువైపులా చెట్లు లేకపోవడంతో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం లేదని ప్రజలు చెబుతున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు ఎండ తీవ్రత దృష్ట్యా మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక శీతలపానీయాలు అధిక మొత్తంలో ప్రజలు తాగుతున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్ స్టాప్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.
ఎండల వల్ల జరుగుతున్న ప్రమాదాలు: ఆ సూర్యప్రతాపానికి విజయవాడ కృష్ణ లంకలో ఓ సెల్‌టవర్ దగ్ధమైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎండ తీవ్రతకు గుంటూరు ఆటో నగర్ దగ్గర ఆర్టీసీ బస్సు టైరు పేలింది. డ్రైవర్ అప్రమత్తతో బస్సును నియంత్రించడం వల్ల ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు.
వడదెబ్బతో ముగ్గురి మృతి: వడదెబ్బతో కృష్ణా జిల్లా గుడివాడలో ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలో పట్టణంలోని బాపూజీ నగర్‌కు చెందిన ఎండీ రెహ్మాన్ (45) సోమవారం మధ్యాహ్నం మృతి చెందగా.. ఇందిరా నగర్ కాలనీ ప్రాంతానికి చెందిన సూరగాని సురేష్ (38) సోమవారం మధ్యాహ్నం కార్మికనగర్ ఎదురుగా ఉన్న రైస్‌మిల్లు పక్కన పడిపోయాడు. అతను వడదెబ్బతో పడిపోయి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం గొడ్డు వెలగల పంచాయతీ జీడిమేకలపల్లికి చెందిన అన్వర్‌బాషా(65) సోమవారం ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై మరణించాడు.
వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు: ఎండా కాలం ప్రమాదాల నుంచి బయటపడాలంటే.. నిపుణులు సూచనలు తప్పక పాటించాలి. పగటి వేళ ఎండలో తిరగకూడదు. తప్పనిసరి అయితే తప్ప పగటి పూట బయటకు వెళ్లకండి.. వీలైెనంత వరకు ఇంట్లోనే ఉండండి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు తరచూ తీసుకోవాలి, వేడి గాలుల ప్రభావంతో వడదెబ్బ తగిలే అవకాశాలు అధికం కాబట్టి ఎండలో వెళ్లినప్పుడు గొడుగు వెంట తీసుకు వెళ్లడం మంచిది. అలాగే తెల్లటి వస్త్రాలు, టోపీ ధరించి వెళ్లాలి. ఎండాకాలంలో ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: