దళితుల శిరోముండనం కేసులో ముద్దాయిగా ఉన్న వైకాపా నాయకుడు తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని దళిత, ప్రజాసంఘాల నాయకులు వ్యతిరేకించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఇంద్రపాలెంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ను ముట్టడించి.. నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, తోట త్రిమూర్తులకు వ్యతిరేకంగా దళిత, ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఎస్సీలంతా ముఖ్యమంత్రి జగన్‌కి ఓటు వేస్తే.. ఆయన మాత్రం ఎస్సీలపై దాడులు చేసిన వారికి అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తోట త్రిమూర్తుల్ని పదవి నుంచి తప్పించాలంటూ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
దళితుల శిరోముండనం కేసులో త్రిమూర్తులుకు శిక్షపడకపోగా.. అధికార ప్రభుత్వం అతనికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం సరైంది కాదని సీపీఎం నాయకుడు శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం రాష్ట్రంలోని దళితులను అవమానపరిచినట్లేనని మండిపడ్డారు. త్రిమూర్తులును పదవి నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం లేవనెత్తుతామని జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రామేశ్వరరావు హెచ్చరించారు.
ఇదీ చదవండి: Cases on Jagan: అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదికను సమర్పించండి: హైకోర్టు