Tension at Anaparthi : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. సామర్లకోట నుంచి అనపర్తి వెళ్తున్న చంద్రబాబును.. బలభద్రపురం దాటిన తర్వాత అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. చంద్రబాబు కాన్వాయ్ అక్కడినుంచి ముందుకు వెళ్లకుండా పోలీసులు.. లారీలు, పోలీసు వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిపి ఉంచారు. అంతేకాకుండా చంద్రబాబు వాహనశ్రేణికి అడ్డంగా రోడ్డుపై కానిస్టేబుళ్లను పోలీసు అధికారులు కూర్చోబెట్టారు. దీంతో చంద్రబాబు బలభద్రపురం నుంచి 5 కిలోమీటర్ల మేర కాలినడకన అనపర్తికి బయలుదేరారు.
కాలినడకన బయల్దేరిన చంద్రబాబు.. గంట 15 నిమిషాల్లో ఆగకుండా 8కిలోమీటర్లకు పైగా నడిచారు. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులు మార్గమధ్యలో బస్సుల్ని రోడ్డుకు అడ్డంగా పెట్టారు. టీడీపీ శ్రేణులు చంద్రబాబు వెంట నడుస్తూ.. అడ్డుగా ఉన్న బస్సుల్ని పక్కకు తోసి.. పోలీసుల్ని తోసుకుంటూ చంద్రబాబును ముందుకు నడిపించారు. దీంతో పలువురిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు గాయపడ్డారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్నా.. చంద్రబాబు పాదయాత్రకు పోలీసులు ఎక్కడా లైట్లు ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులోనే నడిచారు. ఇప్పటికే అనపర్తి చేరుకున్న చంద్రబాబు.. కాసేపట్లో దేవీచౌక్కు చేరుకోనున్నారు.
రౌడీరాజ్యం అంతం చేసేందుకు కౌంట్‌డౌన్ : పోలీసుల చర్యలపై చంద్రబాబు స్పందించారు. మొదట అనుమతి ఇచ్చి.. మళ్లీ తర్వాత అనుమతి ఎలా రద్దు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నామని ప్రకటించారు. ఇంతటితో రౌడీరాజ్యం అంతం చేసేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని హెచ్చరించారు. మా కార్యకర్తలు ముందుకువస్తే పోలీస్ స్టేషన్లు సరిపోవని అన్నారు. ఎంత మందిపైన కేసులు పెడతారో చూస్తామన్నారు. చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు చంద్రబాబు మార్గం సుగమం చేసేందుకు అనపర్తి నుంచి బలభద్రపురం బయలుదేరాయి.
సభకు పోలీసుల నిరాకరణ : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఈ పర్యటన శుక్రవారం రోజున జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో సాగుతోంది. సాయంత్రం అనపర్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే టీడీపీ శ్రేణులు దేవీచౌక్కు రాకుండా పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొదట అనపర్తి పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. సభకు అనుమతి నిరాకరించారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనపర్తి దేవీచౌక్కు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులను తప్పించుకుని పలువురు దేవీచౌక్ సెంటర్‌కు చేరుకున్నారు. దీంతో అనపర్తిలో దుకాణాలను పోలీసులు మూసి వేయించారు.
ఇవీ చదవండి :