పవర్ వచ్చాకే పవర్‌స్టార్ అని పిలవండి
పవర్ వచ్చాకే పవర్‌స్టార్ అని పిలవండని పవన్ జనసైనికులకు సూచించారు. సీఎం అయ్యాకే సీఎం అని పిలవాలని కోరారు. ఇప్పుడు జనసేనాని అని పిలవండని సూచించారు. తాము బాధ్యతగా ఉంటామని..,బాధ్యతగా ఉండాలని అధికార ఎమ్మెల్యేలకు కూడా చెప్పాలని పోలీసులు,అధికారులకు సూచించారు.
ఏ కులంలో పుట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం లేదు. ఎలా ప్రవర్తించాలనేది మన చేతిలో ఉంది. కులంలో చాలా గొప్పోళ్లు ఉంటారు. ఒకరు అన్నారని కులాన్ని నిందించకూడదు.తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్న సామెతలా ప్రవర్తిస్తున్నారు. ద్వారంపూడి మంచి ఇంటి పేరు పెట్టుకుని చంద్రశేఖర్‌రెడ్డి నన్ను దుర్భాషలాడారు. నేను ఆయన్ను ఒక్క మాట అనలేదు..ఆయన దేనిలో ఎక్కువ. నన్ను బూతులు తిడితే మరిన్ని తిట్టగలం.మా వీర మహిళలు అంత కన్నా తిట్టగలరు. ప్రజాస్వామ్యంలో అణచివేత ఏమాత్రం శ్రేయస్కరం కాదు. భాజపా కార్యకర్తలను కూడా వైకాపా వదల్లేదు. జనసేన సైనికులపై దాడులు చేసి వేధిస్తున్నారు. వైకాపా దేనికంటే దానికి నేను 'సై'. అన్నింటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చా.-పవన్ కల్యాణ్
గుంతలు లేని రహదారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ?
గుంతలు లేని రహదారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ? అని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదన్నారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం మంచిది కాదని హితవు పలికారు. రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నానని వెల్లడించారు. కులాల పేరిట కొట్లాటలతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
సజ్జల..మేము సమస్యల గురించి మాట్లాడుతాం. మా కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పోలీసులకు చెప్పడం సరికాదు. వైకాపా ద్వంద్వ వైఖరిని బలంగా ఎండగడతాం. వైకాపా అన్ని కులాలను నలిపేస్తోంది. రెడ్డి సామాజిక వర్గంలోనూ చాలా బాధ ఉంది. వారి చుట్టూ ఉండేవారికి తప్ప ఎవరికీ మేలు జరగట్లేదు. యువత వైకాపాకు ఓటు వేస్తే..ఇప్పటివరకు ఉద్యోగాలు ఇచ్చిందా?. పరిశ్రమలు రావాలి..ఉద్యోగాలు కావాలి. రెండు వేలు, ఐదు వేలు ఇస్తామంటే కుదరదు. వైకాపాకు అధికారమిస్తే అన్ని కులాల్ని కుళ్ల బొడుస్తోంది- పవన్, జనసేన అధినేత
వైకాపా చేయాల్సిన నేరాలు, ఘోరాలన్నీ చేస్తోంది
వైకాపా చేయాల్సిన నేరాలు, ఘోరాలన్నీ చేస్తోందని పవన్ మండిపడ్డారు. వివేకా హత్యపై వైకాపా ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. పోలీసులే మా వెంట పడితే మేం ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమినల్ గ్యాంగ్‌కు వంతపాడి సెల్యూట్ చేయడం బాధగా ఉందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారి పని వాళ్లు చేయాలని లేదంటే తాము రోడ్డు మీదకు వస్తామని హెచ్చరించారు. జనసేన అంటే వైకాపాకు భయం ఉందని.., అందుకే సభకు వచ్చేవారిని ఎక్కడిక్కడ అడ్డుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాని..,పోతే ప్రాణం పోవాలి కానీ రాజకీయాల నుంచి పారిపోయేది లేదన్నారు. సామాజిక మార్పు వచ్చేవరకు పోరాటం చేసి..పదవి తీసుకుంటానన్నారు.
అందుకే తెదేపాకు మద్దతిచ్చా..
కోపాన్ని దాచుకునే కళ అందరూ నేర్చుకోవాలని పవన్ సూచించారు. రాయలసీమలో కోపాన్ని మూడు తరాలు దాచుకుంటారన్నారు. మన కోపం అన్యాయం చేసేవాడికి వెన్నులో నుంచి వణుకు పుట్టించాలన్నారు.
కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకొస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు. సమాజంలో కాపు, తెలగ, ఒంటరి, బలిజలు పెద్దన్న పాత్ర వహించాలి. కమ్మలకు జనసేన వ్యతిరేకం కాదని చెప్పేందుకు తెదేపాకు మద్దతిచ్చా. నేను తగ్గిచూపిస్తున్నా...పెద్దన్నపాత్ర వహించేందుకు మీరు కూడా తగ్గాలి. సమాజంలో మార్పు అనేది గోదావరి జిల్లాలపై ఆధారపడి ఉంది. అధికారంలో లేని వర్గాలకు అధికారమిచ్చేందుకు అందరూ ఏకం కావాలి.లాల్ బహదూర్‌శాస్త్రి వంటి నేతల స్ఫూర్తితో జనసేన ముందుకెళ్తోంది. అన్ని కులాలు, మతాలకు హామీ ఇస్తున్నా. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను. వైకాపాను ఎదుర్కొనేందుకు తెదేపాకు బలం చాలడం లేదు. శక్తి కోసమే జనసేన ముందుకొచ్చింది. ఈ సుదీర్ఘ యుద్ధంలో నా ప్రాణాలు పోతే దేశం నలుమూలలా నా మట్టి చల్లండి. దాష్టీకాన్ని ఎదిరించే కత్తులం కావాలి. వైకాపాపై యుద్ధానికి సిద్ధంకండి. వైకాపా జోలికి నేను వెళ్లలేదు. నేను వెళ్తుంటే లాక్కొచ్చి మానసిక అత్యాచారం చేశారు. ఎలాంటి యుద్ధం కావాలో వైకాపానే నిర్ణయించుకోవాలి. -పవన్
ఇదీ చదవండి
PAWAN TOUR: రాజమహేంద్రవరంలో పవన్ పర్యటన.. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు