'ఆజాదీ కా అమృత్' ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆర్ఎస్ఎస్ కరసేవకులతో నిండిపోయింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదావరి సంగమం కార్యక్రమంలో పాల్గొనటానికి కరసేవకులు భారీగా హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వేల మంది కరసేవకులు ఈ భారీ సంగమంలో పాల్గొన్నారు. కరసేవకులు కవాతుతో గోదావరి సంగమం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతకు ముందు తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నారసింహస్వామిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకారు. మోహన్ భగవత్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ చరిత్ర, విశిష్టతను గురించి వివరించారు.
తర్వాత వేదాశీర్వనాలు అందజేసి... స్వామివారి తీర్థప్రసాదాలను ఇచ్చారు. దర్శనానంతరం మోహన్ భగవత్ సత్యనారాయణరాజుపురంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, ఆయన ప్రయాణించే రహదారిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: RSS Chief: తూర్పుగోదావరి జిల్లాలో.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన