తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మేడిద సాయి నాగేంద్ర మోడల్‌గా సత్తా చాటుతున్నాడు. చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరికతో ... అవకాశం దొరికినప్పుడల్లా పాఠశాల, కళాశాలల్లో డ్యాన్స్, సాంస్కృతిక పోటీల్లో పాల్గొనేవాడు. సినిమా నటుడు కావాలంటే అంత తేలికేం కాదని గ్రహించిన నాగేంద్ర... ముందుగా ఫ్యాషన్ షోలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పలుసార్లు ముంబై వెళ్లి మెళకువలు నేర్చుకున్నాడు.
మిస్టర్ ఇండియా బరిలో..
ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ భారత టాప్ మోడల్ పోటీల్లో విజేతగా నిలిచాడు నాగేంద్ర. ఆ తర్వాత నటన వైపు తన ప్రస్థానం కొనసాగించేందుకు అన్నపూర్ణ సినీ స్టూడియోలో చేరి శిక్షణ పొందుతున్నాడు. తాజాగా మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్- 2020 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ కోనసీమ కుర్రోడినే ఎంపిక చేశారు. ఈ నెల 12న గోవాలో జరిగే ఈ పోటీల్లో నెగ్గేందుకు కసరత్తు చేస్తున్నాడు నాగేంద్ర.
ఇంజనీరింగ్ చదువుతూనే..
అందరి కుర్రాళ్లలా కాకుండా తమ బిడ్డ మోడల్, నటన వైపు ఆసక్తిగా ఉండటంతో మొదట నాగేంద్ర తల్లిదండ్రులు ప్రోత్సహించలేదు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారం చూసుకోవాలని తండ్రి రమేష్ చెప్పారు. కానీ నాగేంద్ర పోటీలో నెగ్గడం...అంతా అభినందించటంతో వారు కూడా కాదనలేకపోయారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూనే తనకిష్టమైన రంగం వైపు అడుగులు వేస్తున్నాడు ఈ కోనసీమ యువకుడు.
ఇదీ చదవండి