MLA Dwarampudi fires on pawan kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని.. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కాకినాడ నగర నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోందని, దీనిపై ఏమంటారన్న ప్రశ్నకు ఆయన స్పందించారు.
‘పవన్ కల్యాణ్ కాకినాడ నగరంలోనే కాదు.. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆ నియోజకవర్గం వైకాపా ఇన్‌ఛార్జిగా బాధ్యతలు తీసుకుని పవన్‌ను ఓడిస్తా. డీటీ నాయక్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు మా కుటుంబాన్ని ఏదో చేశారని, తాను భీమ్లానాయక్‌గా ఏదో చేస్తానని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాల్లో పది మంది వచ్చినా హీరోయిజంతో కొట్టేస్తారేమో.. ఇది రాజకీయం. 30 ఏళ్ల కిందట మా కుటుంబంలో ఉన్న భేదాభిప్రాయాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. దాని ఆధారంగా మావాళ్లలో కొందరిని అరెస్టు చేశారు. ఆ సమయంలో డీటీ నాయక్ మాకు అండగా నిలిచారు. తర్వాత నేనే ఫిర్యాదు ఉపసంహరించుకున్నా. భీమ్లానాయక్ వచ్చి తరిమేస్తే.. ఎవరూ సిద్ధంగా లేరు’ అన్నారు.
మంత్రి పదవిపై ప్రశ్నించగా, మంత్రి పదవిపై తనకు ఆశ లేదన్నారు. సామాజికపరంగా తూర్పుగోదావరి జిల్లాలో రెడ్డి వర్గీయులు మంత్రి పదవి ఆశించడమంత తప్పు మరొకటి లేదన్నారు. అడిగి తమ నాయకుణ్ని ఇబ్బంది పెట్టనని తెలిపారు.
ఆయనది అహంకారం: నాదెండ్ల మనోహర్
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని..నసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గతంలోనూ ఇలా అనవసర సమస్యలు సృష్టించారని.. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై తమ పార్టీ అభ్యర్థి ముత్తా శశిధర్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తుత్తి కబుర్లు చెప్పొద్దు: కందుల
పవన్‌కల్యాణ్‌ను ఓడిస్తానంటూ ఉత్తుత్తి కబుర్లు చెప్పొద్దని కాకినాడ నగర ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ హితవు పలికారు. ఒకర్ని గెలిపించే, ఓడించే శక్తే ఉంటే 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: