రైతులు పంట విరామం ప్రకటించకుండా ఖరీప్ సాగు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ గ్రామల్లో పర్యటించిన ఆయన.. ప్రకృతి వైపరీత్యాలు, ముంపు వంటి సమస్యలతో పంట నష్టపోతే... ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. అనంతరం... అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతులు, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అయినాపురం ప్రాంతంలో ముంపు సమస్య పరిష్కరించేందుకు రూ. 30 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వెంటనే ఖరీప్ సాగు పనులు మొదలు పెట్టాలని రైతులను కోరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వెయ్యి కోట్ల రూపాయలతో గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
రైతు సంఘం నేతలు నిరసన
మంత్రి విశ్వరూప్ కోనసీమ పర్యటన విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నేతలు... అక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వరదల కారణంగా పంట నష్టపోతే.. రాజకీయ నాయకులు హడవుడి చేస్తున్నారే తప్ప రైతులకు న్యాయం చేయటం లేదని ఆక్షేపించారు. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
Rayalaseema Lift: తెలుగుదేశం కాదు.. తెలంగాణ దేశం పార్టీ: మంత్రి అనిల్