తూర్పుగోదావరి జిల్లాలో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని మంత్రి విశ్వరూప్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి, ఆక్వా ఎగుమతులకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. రాజమహేంద్రవరంలో కరోనా నియంత్రణపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో కలిసి విశ్వరూప్ పాల్గొన్నారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్,ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లాలో ఒకరికి కరోనా నెగెటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం.. జాగ్రత్తలను ముమ్మరం చేసింది. ఆక్వా రంగంలో కొన్ని సమస్యలున్నాయని మంత్రి అన్నారు. వాటి ఎగుమతులకై ప్రాసెసింగ్ యూనిట్ల యజామానులతో మాట్లాడామని అన్నారు. దిల్లీ వెళ్లొచ్చినవారందరినీ గుర్తించి క్వారంటైన్లో చేర్చామని చెప్పారు. వైద్య పరికరాల విషయంలో కొరత లేకుండా చూస్తున్నామని అన్నారు. కరోనా కట్టడికి ప్రజలు తప్పనిసరిగా శుభ్రతగా ఉంటూ..సామాజిక దూరం పాటించాలని తెలిపారు.
కరోనా నియంత్రణకై శ్రమిస్తున్న ప్రభుత్వ శాఖలకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అదనపు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా కోరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ నయీం అస్మి పాల్గొన్నారు. ఏప్రిల్ 14 వరకూ లాక్‌డౌన్ ఉన్నందున అత్యవసర పనులకే బయటికి రావాలని..మిగిలిన వారంతా నివాసాలకే పరిమితం కావాలని అదనపు డీజీపీ సూచించారు. పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణకు కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని... వ్యవసాయ ఆక్వా రంగ కార్మికులకు గుర్తింపు కార్డులు లేకుండానే పనులకు హాజరుకావొచ్చని అన్నారు. సరిహద్దుల్లో నిఘా ఉంచినా నిత్యావసర సరుకుల రవాణాకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరించాలని.... వ్యక్తిగత దూరం, శుభ్రత పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని జిల్లా ఎస్పీ నయీం అస్మి కోరారు.
ఇదీచూడండి. 500 కుటుంబాలకు దాత కూరగాయల వితరణ