లక్కీ స్కీంల పేరుతో పేద ప్రజలను మోసం చేస్తూ... నగదు స్వాహా చేస్తున్న ఘరానా మోసగాడిని పట్టుకుని బాధితులు పిఠాపురం పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే...
పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన సిరి ఎంటర్ ప్రైజెస్ అనే ఓ సంస్థ పేరుతో రాహుల్ అనే వ్యక్తి, మరి కొందరు....తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, జగ్గయ్య చెరువు, అగ్రహారం, మోహన్నగర్లతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 1,500 మందిని ఈ స్కీమ్‌లో సభ్యులుగా చేర్చారు. నెలకు రూ.500 వంతున 20 నెలలకు రూ.10 వేలు కట్టాలని ఒక స్కీము, వారం వారం లక్కీ డ్రా పేరుతో మరో స్కీము ఇలా గ్రూపులో ప్రతి సభ్యుడు వద్ద నుంచి వేలల్లో కట్టించుకున్నారు. ఇలా ప్రతి వాయిదాకు ఆరుగురుకి ద్విచక్ర వాహనాలు, వాషింగ్ మెషిన్లు, బంగారు నక్లెస్ వంటి వస్తువులు ఇస్తున్నట్లు సిరి ఎంటర్ ప్రైజెస్ సంస్థ పేరున పుస్తకాలు కూడా ముద్రించి చీటీలు కట్టిన వారికి ఇచ్చారు. ఇలా డబ్బులు కట్టి గడువు ముగిసినా వస్తువులు ఇవ్వలేదు.
కొంత కాలంగా అతడు కనిపించకపోవడంతో... కరోనా కారణంగా రాలేదనుకున్నారు. ఫోన్ చేస్తే ఏవేవో కుంటు సాకులు చెప్పు కుంటూ వచ్చాడు.. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం నిందితుడు పిఠాపురం, జగ్గయ్య చెరువు ప్రాంతానికి రావడంతో మోసపోయిన బాధితులంతా అతడిని పట్టుకుని పిఠాపురం పట్టణ పోలీసులకు అప్పగించారు. తమకు న్యాయం చేయాలంటూ సుమారు 200 మంది పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. వారి నుంచి పట్టణ ఎస్సై అబ్దుల్ నబీ ఫిర్యాదు తీసుకుని, విచారణ నిమిత్తం రాహుల్‌ను తణుకుకు తీసుకెళ్లారు.
ఇవీ చదవండి: 'ఎయిర్టెల్ కేవైసీ పేరిట మోసం... కమీషన్ చెల్లిస్తే సొమ్ము ఇస్తానని బేరం'